Visa: టూరిస్టులు, విద్యార్థులకు గుడ్‌న్యూస్.. భారత వీసా వ్యవస్థలో సంచలన మార్పులు
భారత ప్రభుత్వం వీసా వ్యవస్థను మరింత సరళతరం చేసింది. ప్రధాన కేటగిరీలను 13 నుంచి 9కి, ఉప-కేటగిరీలను 49కి 23కి తగ్గించింది.
Visa System
Visa: విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, అలాగే వైద్యం కోసం భారత్‌కు వచ్చే రోగుల ప్రయాణాలను అత్యంత సులభతరం చేసేందుకు కేంద్ర హోంశాఖ భారతీయ వీసా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న సంక్లిష్టమైన నిబంధనలను సవరిస్తూ ప్రధాన వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి తగ్గించింది. అలాగే ఉప-విభాగాలను 49 నుంచి 23కి కుదించింది. విదేశీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన వీసా మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి చెందిన దేశాల విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
దరఖాస్తు ఫారాల్లో 70 శాతం కాలమ్‌ల తగ్గింపు
విదేశీ ప్రయాణికులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం దరఖాస్తు ఫారాలను చాలా వరకు సరళతరం చేసింది. మొత్తం 23 వీసా ఉప-కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాల్లో పూరించాల్సిన కాలమ్‌లను 65 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గించారు. దీనివల్ల దరఖాస్తుదారులు తక్కువ సమయంలో సులభంగా ఫారమ్ నింపవచ్చు. ప్రాసెసింగ్ వేగం పెరగడంతో పాటు అధికారులు కూడా త్వరగా పరిశీలించే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది చివరి నాటికి ఐటీ సిస్టమ్ అప్‌గ్రేడ్ పూర్తై కొత్త విధానంలో వీసాల జారీ ప్రారంభం కానుంది.
9 ప్రధాన వీసా కేటగిరీలు
సవరించిన నూతన వీసా ఫ్రేమ్‌వర్క్ కింద ఇప్పుడు మొత్తం తొమ్మిది ప్రధాన కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. అవి బిజినెస్ వీసా, డిప్లొమాటిక్ వీసా, వర్క్ వీసా, జర్నలిస్ట్ వీసా, మెడికల్ వీసా, ఆఫీషియల్ వీసా, స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా అలాగే మిస్లేనియస్ వీసా. ఇందులో పర్యాటకులు, వ్యాపారవేత్తల కోసం విజిటర్ వీసాను V-1, V-2 రకాలుగా విభజించారు. స్వల్పకాలిక పర్యటనలు, మ్యూజిక్ లేదా యోగా కోర్సులకు వచ్చే వారికి V-1 వర్తిస్తుంది. అలాగే సుదీర్ఘకాలం ఉండే వారికి V-2 కేటగిరీ అందుబాటులో ఉంటుంది.
మెడికల్ అలాగే స్టూడెంట్ వీసాలపై ప్రత్యేక దృష్టి
భారత్‌లో వైద్య చికిత్సలను ప్రోత్సహించే దిశగా మెడికల్ వీసాల్లో ఆయుష్ చికిత్సల కోసం ప్రత్యేకంగా M-3 కేటగిరీని కేటాయించారు. సాధారణ చికిత్సల కోసం M-1 వీసా ఉంటుంది. వీరికి సహకరించే సహాయకులకు అటెండెంట్ వీసాలు లభిస్తాయి. ఇక విద్యాపరంగా భారత్‌కు వచ్చే విద్యార్థుల కోసం S-1, S-2 కేటగిరీలను రూపొందించారు. ఐదేళ్ల వరకు లేదా కోర్సు పూర్తి అయ్యే వరకు మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యంతో విద్యార్థులకు ఈ వీసాలు జారీ చేస్తారు. దీనివల్ల విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది.
వ్యాపార రంగం నిపుణులకు వెసులుబాట్లు
వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బిజినెస్ వీసాలను B-1 అలాగే B-2 రకాలుగా సమన్వయం చేశారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టే వారికి B-1 వీసా ఇవ్వనున్నారు. సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు భారతదేశానికి వచ్చి ప్లాంట్ల ఇన్స్టాలేషన్ లేదా ట్రైనింగ్ ఇవ్వడానికి B-2 కేటగిరీ కింద ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసా పొందవచ్చు. ఈ స్పష్టమైన నిబంధనల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశ ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.




