Sugar Export Ban : చక్కెర ఎగుమతులపై కేంద్రం షాక్.. సెప్టెంబర్ 2026 వరకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు

Sugar Export Ban : భారత ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై సెప్టెంబర్ 2026 వరకు నిషేధం విధించింది. దేశీయంగా ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

CR Reddy
Published on: 14 May 2026 8:30 AM IST
Sugar Export Ban
X

Sugar Export Ban 

Sugar Export Ban : భారత ప్రభుత్వం చక్కెర ప్రియులకు తీపి కబురు, వ్యాపారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా చూసేందుకు, ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై తక్షణమే అమల్లోకి వచ్చేలా నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 2026 సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బుధవారం రాత్రి స్పష్టం చేసింది.

నిషేధం ఎందుకు?

ప్రధానంగా దేశీయ అవసరాలకు సరిపడా చక్కెర నిల్వలను అందుబాటులో ఉంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. గతేడాది ఎల్‌నినో ప్రభావంతో చెరకు దిగుబడి తగ్గడం, ఈ ఏడాది కూడా రుతుపవనాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడం వల్ల వరుసగా రెండో ఏడాది కూడా ఉత్పత్తి తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఎగుమతులకు బ్రేక్ వేశారు.

ముందస్తు ఒప్పందాల పరిస్థితి ఏంటి?

నిషేధం అమల్లోకి రాకముందే ఓడరేవులకు చేరుకున్న సరుకులకు ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది.

* నోటిఫికేషన్ రావడానికి ముందే నౌకల్లో లోడ్ అయిన సరుకులు.

* భారత ఓడరేవుల వద్ద ఇప్పటికే లంగరు వేసిన నౌకలకు సంబంధించిన స్టాక్.

* కస్టమ్స్ అధికారులకు అప్పగించి, షిప్పింగ్ బిల్లులు నమోదైన నిల్వలకు మినహాయింపు ఉంటుంది.

అయితే, యూరోపియన్ యూనియన్ (EU), అమెరికా (USA)కు పంపే నిర్ణీత కోటా ఎగుమతులకు మాత్రం ఈ నిషేధం వర్తించదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

థాయ్‌లాండ్, బ్రెజిల్‌లకు పండగే

ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు అయిన భారత్ నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. న్యూయార్క్ ముడి చక్కెర ఫ్యూచర్స్ 2 శాతం, లండన్ తెల్ల చక్కెర ధరలు 3 శాతం వరకు పెరిగాయి. భారత్ దూరమవ్వడంతో ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా దేశాలు తమ అవసరాల కోసం బ్రెజిల్, థాయ్‌లాండ్ వైపు చూస్తున్నాయి. ఇది ఆ దేశాలకు కలిసివచ్చే అంశం అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story