రైల్వే కౌంటర్ల వద్ద దలారుల ఆటలకు చెక్.. ‘క్యూ-మిత్ర’తో క్షణాల్లో కన్ఫర్మ్ టికెట్..!
Indian Railways Q Mitra System: సాధారణంగా పండుగల సమయంలోనో లేదా అత్యవసర పరిస్థితుల్లోనో ఊరికి వెళ్లాలంటే తత్కాల్ టికెట్ దొరకడం గగనమైపోతుంది.
రైల్వే కౌంటర్ల వద్ద దలారుల ఆటలకు చెక్.. ‘క్యూ-మిత్ర’తో క్షణాల్లో కన్ఫర్మ్ టికెట్..!
Indian Railways Q Mitra System: రైలు ప్రయాణికులకు ఇక తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవస్థలు తప్పనున్నాయి. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్, దలారుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ భారతీయ రైల్వే ‘క్యూ-మిత్ర’ అనే సరికొత్త డిజిటల్ టోకెన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక సాంకేతికతతో పనిచేసే ఈ సరికొత్త మెషీన్ కేవలం ముఖం చూపిస్తే చాలు, నిమిషాల్లో కన్ఫర్మ్ టికెట్ మీ సొంతమవుతుంది.
రైల్వే కౌంటర్ల వద్ద సరికొత్త విప్లవం..
సాధారణంగా పండుగల సమయంలోనో లేదా అత్యవసర పరిస్థితుల్లోనో ఊరికి వెళ్లాలంటే తత్కాల్ టికెట్ దొరకడం గగనమైపోతుంది. కౌంటర్లు తెరిచిన కొద్ది నిమిషాలకే టికెట్లు అయిపోవడం, సామాన్య ప్రయాణికులకు నిరాశే ఎదురవడం మనం నిత్యం చూస్తుంటాం. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని దళారులు తప్పుడు గుర్తింపు కార్డులతో టికెట్లను కొల్లగొట్టి, వాటిని ప్రయాణికులకు భారీ ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీకి శాశ్వతంగా ముగింపు పలికేందుకు తూర్పు మధ్య రైల్వే ‘క్యూ-మిత్ర’ (Q-Mitra) అనే డిజిటల్ టోకెన్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
అసలు ఏంటి ఈ ‘క్యూ-మిత్ర’ సాంకేతికత?
ఇక్కడ ‘క్యూ’ అంటే వరుస క్రమం అని అర్థం. ఈ విధానం ద్వారా ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లకముందే తమ స్మార్ట్ఫోన్ ద్వారా వరుస సంఖ్యను రిజర్వ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రయాణికుడు తన మొబైల్ నంబర్, ఆధార్ కార్డు వివరాల సహాయంతో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మొబైల్కు ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ (QR Code) తో కూడిన డిజిటల్ టోకెన్ అందుతుంది. ఈ టోకెన్ నంబర్ ఆధారంగానే కౌంటర్ వద్ద టికెట్లు కేటాయిస్తారు. ఫలితంగా స్టేషన్లలో తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడాల్సిన, తోపులాటలకు గురికావాల్సిన అవసరం ప్రయాణికులకు పూర్తిగా తప్పుతుంది.
ముఖం గుర్తింపుతోనే టికెట్ జారీ..
ఈ సరికొత్త వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం ‘ఫేస్ రికగ్నిషన్’ అంటే ముఖాన్ని గుర్తించే సాంకేతికత. ప్రయాణికుడు టికెట్ తీసుకోవడానికి కౌంటర్ వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడ ఉన్న మెషీన్ సదరు వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేస్తుంది. మొబైల్లో టోకెన్ తీసుకున్న వ్యక్తి, కౌంటర్ ముందు నిలబడి టికెట్ కొనుగోలు చేస్తున్న వ్యక్తి ఒకరేనా కాదా అని ఈ వ్యవస్థ నిశితంగా పరిశీలిస్తుంది. ఇద్దరి ముఖాలు సరిపోలితేనే కౌంటర్ లోని సిబ్బంది టికెట్ జారీ చేస్తారు. దీనివల్ల ఒకరి పేరు మీద మరొకరు టికెట్లు తీసుకునే అవకాశం అస్సలు ఉండదు.
దలారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న వేళ..
ఇప్పటివరకు దళారులు వేర్వేరు వ్యక్తుల ఆధార్ కార్డులను లేదా నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి తత్కాల్ టికెట్లను బుక్ చేసేవారు. కానీ ఈ సరికొత్త నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డుపై కేవలం ఒకే ఒక్క డిజిటల్ టోకెన్ లభిస్తుంది. దానికి తోడు కౌంటర్ వద్ద ముఖాన్ని ధృవీకరించడం తప్పనిసరి చేయడంతో దలారుల పప్పులు ఇక ఉడకవు. నకిలీ పేర్లతో టికెట్లు కొని బ్లాక్లో అమ్మే దొంగల నెట్వర్క్ను ఈ సాంకేతికత పూర్తిగా దెబ్బతీస్తుందని రైల్వే ఉన్నతాధికారులు నమ్మకంగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఎక్కడ అందుబాటులో ఉంది?
భారతీయ రైల్వే ఈ సరికొత్త వ్యవస్థను ప్రస్తుతానికి ప్రయోగాత్మక ప్రాజెక్టుగా తూర్పు మధ్య రైల్వే పరిధిలోని కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే ప్రవేశపెట్టింది. బీహార్లోని బెగుసరాయ్ రైల్వే స్టేషన్లో ఈ విధానం విజయవంతం కావడంతో, ప్రస్తుతం ఆరా జంక్షన్ స్టేషన్లో కూడా దీనిని అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ గనుక ఆశించిన ఫలితాలు వస్తే, త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లకు ఈ ‘క్యూ-మిత్ర’ సేవలను విస్తరింపజేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది.
సామాన్య ప్రయాణికుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, దలారుల ప్రమేయం లేని పారదర్శకమైన సేవలను అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ వేస్తున్న ఈ అడుగు ప్రశంసనీయం. ఆధునిక డిజిటల్ టోకెన్లు, ఫేస్ రిగన్నేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా భారతీయ రైల్వే వ్యవస్థ డిజిటల్ దిశగా ఎంత వేగంగా దూసుకుపోతుందో స్పష్టమవుతోంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సామాన్యుడి కన్ఫర్మ్ టికెట్ కల నిజమవడం ఖాయం.




