Crude Oil Tanker: హోర్మజ్ జలసంధి సమీపంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
Crude Oil Tanker: హోర్మజ్ జలసంధి సమీపంలో చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. నౌకలోని ముగ్గురు భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారు.
Crude Oil Tanker: హోర్మజ్ జలసంధి సమీపంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
Crude Oil Tanker: పర్షియన్ గల్ఫ్‌లో హోర్మజ్ జలసంధికి సమీపంలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్‌పై ప్రక్షేపక దాడి జరిగింది. నవంబర్ 18న జరిగిన ఈ ఘటనలో నౌకలో ఉన్న ముగ్గురు భారతీయ నావికులతో సహా సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.
'MT NAVIG8 MESSI' అనే ముడి చమురు ట్యాంకర్ హోర్మజ్ జలసంధి వైపు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు మంత్రి సోషల్ మీడియా వేదిక 'X'లో తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, అయితే ఒక భారతీయ అధికారిని ప్రథమ చికిత్సతో పాటు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
నౌకలోని ముగ్గురు భారతీయ నావికులతో సహా సిబ్బంది అందరి భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. నౌక నిర్వహణ సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సిబ్బంది సంక్షేమం, భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
హోర్మజ్ జలసంధిలో వరుస దాడులు
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్మజ్ జలసంధి సమీపంలో చోటుచేసుకుంటున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 16న ఇదే ప్రాంతంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న 'MT TARA GAS' అనే ఎల్పీజీ ట్యాంకర్‌పై కూడా క్షిపణి దాడి జరిగింది. ఆ నౌకలో 24 మంది భారతీయ నావికులు ఉన్నారు.
ఈ ఘటన అనంతరం వారిలో 21 మందిని సురక్షితంగా ఒమన్‌లోని ఖసాబ్‌కు తరలించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. గాయపడిన ఇద్దరు భారతీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో నావికుడు గల్లంతైనట్లు తెలిపింది.
గల్లంతైన నావికుడి కోసం కొనసాగుతున్న అన్వేషణ, సహాయక చర్యలను ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో కలిసి పర్యవేక్షిస్తోందని MEA పేర్కొంది. సహాయక చర్యల్లో తక్షణమే స్పందించి సహకరించిన ఒమన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
హోర్మజ్ జలసంధి సమీపంలో నౌకలపై వరుస దాడులు జరగడం, భారతీయ నావికుల భద్రతపై ఆందోళనలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న భారత ప్రభుత్వం, నౌకా నిర్వహణ సంస్థలతో సమన్వయం చేసుకుంటోంది.




