Stocks: మార్కెట్లలో మందగమనం.. పశ్చిమాసియా సెగతో కుదేలైన సూచీలు..
Stocks: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఈ వారం ఏమాత్రం కలిసిరాలేదు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , ముడిచమురు ధరల పెరుగుదల భారత
Stocks
Stocks: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఈ వారం ఏమాత్రం కలిసిరాలేదు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , ముడిచమురు ధరల పెరుగుదల భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య మారుతున్న సమీకరణాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. వారంతపు గణాంకాలను పరిశీలిస్తే, ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు 2 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 2.3 శాతం క్షీణించగా, నిఫ్టీ 1.9 శాతం మేర పతనమైంది. అయితే భారీ షేర్లతో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కొంత నిలకడను ప్రదర్శించడం ఇన్వెస్టర్లకు స్వల్ప ఊరటనిచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణం కాగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) కొనుగోళ్లతో మార్కెట్‌ను కొంతవరకు ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఐటీ రంగానికి శాపంగా మారిన గైడెన్స్.. ఊపందుకున్న అమ్మకాలు
ఈ వారంలో అత్యధికంగా నష్టపోయిన విభాగంగా ఐటీ రంగం నిలిచింది. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ ఏకంగా 10 శాతం మేర పతనమవ్వడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇన్ఫోసిస్ , టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు తమ త్రైమాసిక ఫలితాలను అంచనాలకు అనుగుణంగానే ప్రకటించినప్పటికీ, రాబోయే ఆర్థిక సంవత్సరానికి (FY27) సంబంధించి కంపెనీల యాజమాన్యాలు వెల్లడించిన ఆదాయ గైడెన్స్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. భవిష్యత్తులో ఐటీ కంపెనీల ఆర్జన సామర్థ్యం తగ్గొచ్చనే భయాలు ఇన్వెస్టర్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ వంటి వినియోగ ఆధారిత రంగాలు మాత్రం సానుకూల పనితీరును కనబరిచాయి. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ బ్యాంకింగ్ , ఆర్థిక సేవల విభాగం స్థిరమైన ఫలితాలను నమోదు చేయడం విశేషం.
క్రూడాయిల్ సెగ , అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం
మార్కెట్ గమనాన్ని ఈ వారం ప్రధానంగా ముడిచమురు ధరలు శాసించాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణాపై ఇరాన్ ఆంక్షలు విధించడం , అమెరికా నౌకాదళం ఇరాన్ నౌకలను అడ్డుకోవడం వంటి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను మండిస్తున్నాయి. కేవలం వారం రోజుల్లోనే బ్రెంట్ క్రూడ్ ధర 15 శాతం పెరిగి బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరుకుంది. ఇది భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెను సవాలుగా మారింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గకపోవడం ఇన్వెస్టర్లను జాగ్రత్తగా వ్యవహరించేలా చేసింది. ఈ అస్థిరత కారణంగా మార్కెట్లు రికవరీకి ప్రయత్నించిన ప్రతిసారీ పైస్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
వచ్చే వారం ఇన్వెస్టర్ల చూపు ఆ గణాంకాలపైనే
రాబోయే వారంలో మార్కెట్లు కోలుకుంటాయా లేదా అనేది వెలువడబోయే కీలక ఆర్థిక గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. భారత పారిశ్రామికోత్పత్తి (IIP) గణాంకాలతో పాటు అమెరికా, చైనా , జపాన్ దేశాల తయారీ రంగ పీఎంఐ రీడింగ్స్ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ , ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో త్రైమాసిక ఫలితాల సీజన్ కూడా వ్యక్తిగత షేర్ల కదలికలకు కీలకం కానుంది. ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతున్న తరుణంలో, దేశీయ లిక్విడిటీ ఏ మేరకు మార్కెట్‌ను నిలబెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




