Jio Platforms IPO: రూ. 30,000 కోట్లతో జియో ఐపీఓ సంచలనం.. నేటి నుంచే బిడ్డింగ్ స్టార్ట్..!

Jio Platforms IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ 'జియో ప్లాట్‌ఫామ్స్' నేడు (అక్టోబర్ 21) ప్రారంభమైంది.

Gagan kumar
Published on: 21 Oct 2026 7:13 AM IST
Jio Platforms IPO
X

Jio Platforms IPO: రూ. 30,000 కోట్లతో జియో ఐపీఓ సంచలనం.. నేటి నుంచే బిడ్డింగ్ స్టార్ట్..!

Reliance Jio: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక కొత్త ఘట్టానికి నేడు (అక్టోబర్ 21) తెరలేచింది. టెలికాం, డిజిటల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రిలయన్స్ గ్రూప్‌కు చెందిన 'జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి పబ్లిక్ ఇష్యూ నేటి నుంచే పెట్టుబడిదారులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓగా నిలవనున్న ఈ ఆఫర్‌పై మార్కెట్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అక్టోబర్ 21న ప్రారంభమై, అక్టోబర్ 23న ముగుస్తుంది.అక్టోబర్ 28న ఈ షేర్లు స్టాక్ ఎక్స్‌ఛేంజీలలో నమోదు కానున్నాయి. ఒక షేరుకు రూ. 1,065 నుండి రూ. 1,119గా నిర్ణయించారు.లాట్ సైజు 12 షేర్లు. గరిష్ట ధర వద్ద ఒక లాట్ కొనుగోలు చేయడానికి కనీస రిటైల్ పెట్టుబడి రూ. 13,428 అవుతుంది. ఈ ఆఫర్ ద్వారా సుమారు రూ. 30,213 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద జియో ప్లాట్‌ఫామ్స్ విలువ ఏకంగా రూ. 10.3 లక్షల కోట్లకు చేరుకోనుంది.

ఐపీఓ అధికారికంగా నేడు ప్రారంభమైనప్పటికీ, అంతకంటే ముందే సంస్థాగత పెట్టుబడిదారుల నుండి ఊహించని రీతిలో స్పందన లభించింది. కేటాయించిన రూ. 8,110 కోట్ల యాంకర్ బుక్ కోసం ఏకంగా 30 రెట్లకు పైగా బిడ్లు రావడం మార్కెట్ వర్గాలను విస్తుపోయేలా చేసింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్‌ఐసీ , బ్లాక్‌రాక్, ఫిడిలిటీ , జీఐసీలతో పాటు దేశీయంగా అగ్రగామి మ్యూచువల్ ఫండ్ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టడానికి పోటీపడ్డాయి.

ఈ ఆఫర్ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ రూపంలో జరుగుతోంది. జేపీఎల్ ఉద్యోగుల కోసం రూ. 500 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత వాటాదారుల కోసం రూ. 2,500 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు. ఐపీఓ ద్వారా వచ్చే నిధులలో దాదాపు రూ. 27,500 కోట్లను టెలికాం అనుబంధ సంస్థ 'రిలయన్స్ జియో ఇన్ఫోకామ్' రుణాల చెల్లింపు కోసం ఉపయోగించనున్నారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు మళ్లిస్తారు.

2016లో వాణిజ్య సేవలు ప్రారంభించిన జియో, తక్కువ ధరకే అపరిమిత డేటాను అందిస్తూ భారత్‌లో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. 2026 జూన్ నాటికి జియో నెట్‌వర్క్‌కు 53.3 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారతదేశంలోని మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతం ఒక్క జియో నెట్‌వర్క్ ద్వారానే సాగుతుండటం దీని ప్రభావాన్ని చెబుతోంది.

కేవలం టెలికాం సేవలకు పరిమితం కాకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్లౌడ్ మౌలిక సదుపాయాల వైపు వేగంగా విస్తరిస్తోంది. మెటా , గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో కుదుర్చుకున్న భాగస్వామ్యాలు జియో డిజిటల్ వ్యాపారానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చాయి.

దేశంలోనే అత్యంత విలువైన డిజిటల్ నెట్‌వర్క్‌లో భాగస్వాములు కావడానికి సాధారణ రిటైల్ పెట్టుబడిదారులకు ఈ ఐపీఓ ఒక బంగారు అవకాశంగా నిలవనుంది. భారత స్టాక్ మార్కెట్ ఆల్-టైమ్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమైన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఏ స్థాయిలో చరిత్ర సృష్టిస్తుందో రాబోయే మూడు రోజుల్లో తేలనుంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.