Dengue Vaccine: డెంగ్యూ వ్యాధికి చెక్.. భారత్‌లోకి తొలి యాంటీ-డెంగ్యూ వ్యాక్సిన్

Dengue Vaccine: భారతదేశంలో ప్రతియేటా లక్షలాది మందిని భయపెట్టే డెంగ్యూ వ్యాధికి వ్యతిరేకంగా పోరులో ఒక గొప్ప ముందడుగు పడింది.

CR Reddy
Published on: 19 Sept 2026 9:05 AM IST
Dengue Vaccine
X

Dengue Vaccine

Dengue Vaccine: భారతదేశంలో ప్రతియేటా లక్షలాది మందిని భయపెట్టే డెంగ్యూ వ్యాధికి వ్యతిరేకంగా పోరులో ఒక గొప్ప ముందడుగు పడింది. దేశంలో డెంగ్యూ వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మొట్టమొదటి యాంటీ-డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జపాన్‌కు చెందిన టెకేడా ఫార్మాసూటికల్స్ సంస్థల మధ్య ఇటీవల ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యంతో టెకేడా సంస్థ తయారు చేసిన క్యూడెంగా అనే యాంటీ-డెంగ్యూ వ్యాక్సిన్‌ను భారత్‌లో మార్కెట్ చేసేందుకు మార్గం సుగమమైంది.

ఈ ఒప్పందం ప్రకారం.. దేశంలోని చిన్నారులు, పెద్దల కోసం ప్రైవేట్ మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్‌ను ప్రమోట్ చేసి పంపిణీ చేసే బాధ్యతను డాక్టర్ రెడ్డీస్ తీసుకోనుంది. వచ్చే ఏడాది, అనగా 2027 మొదటి ఆరు నెలల్లోపే ఈ క్యూడెంగా వ్యాక్సిన్ భారతీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జూలై నెలలోనే దీనికి మార్కెటింగ్ అనుమతులు లభించినప్పటికీ, స్థానిక నిబంధనలకు అనుగుణంగా పూర్తి కావాల్సిన ప్రక్రియలు జరుగుతున్నట్లు టెకేడా ఇంటర్కాంటినెంటల్ మార్కెట్స్ హెడ్ మహేంద్ర నాయక్ తెలిపారు.

భారత్‌లో డెంగ్యూ అనేది ఒక తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్(ICMR) సర్వే ప్రకారం, దేశంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ వైరస్‌కు సంబంధించిన నాలుగు సీరోటైప్స్ (DENV-1 నుంచి DENV-4 వరకు) ఒకే సమయంలో క్రియాశీలంగా ఉన్నాయి. అంతేకాకుండా, చాలా మంది రోగులలో ఒకేసారి ఎకాడిక సీరోటైప్స్ సోకుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా డెంగ్యూ కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్‌ను ప్రైవేట్ మార్కెట్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ప్రభుత్వ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో కూడా దీనిని చేర్చడం దీర్ఘకాలిక లక్ష్యమని కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే డెంగ్యూ వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రజలు ప్రాణాపాయం నుంచి సులభంగా బయటపడొచ్చని వైద్య నిపుణులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.