Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు భారీ షాక్.. భారత్‌లో 20 శాతం తగ్గిన అమ్మకాలు!
Smartphone Market: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2026 మూడో త్రైమాసికంలో 20 శాతం పడిపోయింది. బడ్జెట్ ఫోన్ల అమ్మకాలు భారీగా తగ్గాయి.
Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు భారీ షాక్.. భారత్‌లో 20 శాతం తగ్గిన అమ్మకాలు!
Smartphone Market: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ క్షీణత నమోదైంది. పెరుగుతున్న విడిభాగాల ధరలు, స్మార్ట్‌ఫోన్‌ల తయారీ వ్యయం అధికం కావడం, పరికరాల ధరలు పెరగడంతో సామాన్య వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గింది. దీంతో 2026 మూడవ త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గతేడాది ఇదే కాలంతో పోలిస్తే (YoY) 20 శాతం క్షీణించినట్లు సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) వెల్లడించింది. అయితే, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో మాత్రం గణనీయమైన వృద్ధి నమోదైంది.
బడ్జెట్ ఫోన్లకు భారీ దెబ్బ
CMR నివేదిక ప్రకారం.. రూ.7,000 లోపు ధర కలిగిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్లు గతేడాదితో పోలిస్తే ఏకంగా 94 శాతం పడిపోయాయి. రూ.7,000 నుంచి రూ.24,999 మధ్య ధర కలిగిన వాల్యూ ఫర్ మనీ విభాగంలోనూ 42 శాతం క్షీణత నమోదైంది. పెరుగుతున్న విడిభాగాల ధరలు, ఫోన్ల ధరల పెరుగుదల ఈ విభాగాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది.
ప్రీమియం ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్
మరోవైపు, అధిక ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ మాత్రం సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రూ.25,000 నుంచి రూ.49,000 మధ్య ధర కలిగిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్లు 38 శాతం పెరిగాయి. అలాగే రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు ధర కలిగిన సూపర్ ప్రీమియం విభాగం 32 శాతం వృద్ధిని సాధించింది. మెరుగైన పనితీరు, ప్రత్యేక ఫీచర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలపై వినియోగదారుల్లో ఆసక్తి పెరగడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఫోన్ల మార్పులో వినియోగదారుల వెనుకడుగు
పెరుగుతున్న మెమరీ, ఇతర విడిభాగాల ధరల కారణంగా స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరుగుతున్నాయని CMR సీనియర్ అనలిస్ట్ మేంకా కుమారి తెలిపారు. దీంతో వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోలుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారని, పాత ఫోన్లను ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, మెరుగైన ఫీచర్లు, పనితీరు, AI టెక్నాలజీ అందుబాటులో ఉండటంతో ప్రీమియం ఫోన్లకు డిమాండ్ కొనసాగుతోందని వివరించారు.
2026లోనూ మార్కెట్ క్షీణత అంచనా
వినియోగదారుల ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం, విడిభాగాల ధరలు పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో 2026 క్యాలెండర్ సంవత్సరంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 11 నుంచి 12 శాతం వరకు క్షీణించే అవకాశం ఉందని CMR అంచనా వేసింది. ముఖ్యంగా సరసమైన ధరల్లో లభించే ఫోన్ల మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని తెలిపింది.
రూ.15,000 లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేయడం, పాత పరికరాలనే ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల ఈ విభాగంలో డిమాండ్ మరింత తగ్గే అవకాశం ఉందని CMR సీనియర్ అనలిస్ట్ అమిత్ శర్మ అభిప్రాయపడ్డారు. దీనికి భిన్నంగా ప్రీమియం, సూపర్ ప్రీమియం విభాగాల్లో డిమాండ్ స్థిరంగా ఉండొచ్చని పేర్కొన్నారు.
ఫీచర్ ఫోన్లలో 2Gకి పెరిగిన ఆదరణ
ఇక 2026 మూడవ త్రైమాసికంలో 2G ఫీచర్ ఫోన్ల షిప్‌మెంట్లు గతేడాదితో పోలిస్తే 3 శాతం పెరిగాయి. అయితే 4G ఫీచర్ ఫోన్ల షిప్‌మెంట్లు మాత్రం 46 శాతం తగ్గాయి. మరోవైపు, మెమరీ ధరలు మరికొంత కాలం పెరుగుదల బాటలోనే ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. 2027లో ధరల హెచ్చుతగ్గులు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, పెరుగుతున్న మెమరీ, విడిభాగాల వ్యయాలు స్మార్ట్‌ఫోన్ తయారీదారులపై ఒత్తిడిని కొనసాగించనున్నాయి.




