ఇండిగో ప్రయాణికులకు బిగ్ షాక్.. విమాన టికెట్ ధరలు పెంపు

ఇండిగో విమాన టికెట్లపై ఇంధన సర్‌ఛార్జ్ పెంచింది. అక్టోబర్ 6 నుంచి దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో కొత్త ఛార్జీలు అమలు కానున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Oct 2026 12:20 AM IST
IndiGo Flight Charges Hike
X

IndiGo Flight Charges Hike

IndiGo Flight Charges: విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ షాక్ ఇచ్చింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు అక్టోబర్ 6, 2026 నుంచి చేసే అన్ని కొత్త బుకింగ్‌లకు వర్తించనున్నాయి.

ఇటీవల విమాన ఇంధనం ధరలు భారీగా పెరిగాయి. గతవారం ఏటీఎఫ్ ధర లీటరుకు రూ.16 పెరగగా.. అంతకుముందు ఆగస్టులో రూ.5, సెప్టెంబర్‌లో మరో రూ.6.28 చొప్పున పెరిగింది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఖర్చుల్లో ఇంధన వ్యయం సుమారు 40 శాతం వరకు ఉండటంతో.. పెరుగుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఇంధన సర్‌ఛార్జ్ పెంచుతున్నట్లు ఇండిగో వెల్లడించింది.

కొత్త సర్‌ఛార్జ్ కారణంగా దేశీయ విమాన టికెట్ల ధరలు ప్రయాణ దూరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.350 వరకు పెరిగే అవకాశం ఉంది. 500 కిలోమీటర్ల వరకు ఉండే మార్గాలకు రూ.375, 1,000 కిలోమీటర్ల వరకు రూ.600, 1,500 కిలోమీటర్ల వరకు రూ.900, 2,000 కిలోమీటర్ల వరకు రూ.1,150 సర్‌ఛార్జ్ వసూలు చేయనున్నారు. 2,000 కిలోమీటర్లకు మించిన సుదీర్ఘ మార్గాలకు రూ.1,300 ఇంధన సర్‌ఛార్జ్ వర్తించనుంది.

అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా అదనపు భారం పడనుంది. సార్క్ దేశాలకు వెళ్లే విమానాలపై రూ.1,000 నుంచి రూ.3,000 వరకు, ఆఫ్రికా సర్వీసులపై రూ.6,000, యూరప్ మార్గాల్లో రూ.10,000 వరకు ఇంధన సర్‌ఛార్జ్ విధించనున్నారు.

దీంతో ఇండిగోలో విమాన ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు ఇకపై టికెట్ బుక్ చేసుకునే సమయంలో పెరిగిన ఇంధన సర్‌ఛార్జ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్