IndiGo Free Flights: ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల మందికి ఉచిత విమాన టికెట్లు!

20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండిగో 20 వేల ఉచిత విమాన టికెట్ల ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 4-6 మధ్య బుక్ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Aug 2026 4:30 AM IST
IndiGo Free Flights
X

IndiGo Free Flights

IndiGo Free Flights : దేశీయ విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. విమాన సేవలు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఇండిగోఫ్రీ’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 20 వేల దేశీయ విమాన టికెట్లను ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే ఇది సాధారణ డిస్కౌంట్ కూపన్‌ తరహా ఆఫర్ కాదు. ప్రయాణికులు ఓ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి టికెట్‌ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

ఎలా పొందాలి?

ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6, 2026 మధ్య ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్ యాప్ లేదా సంస్థకు చెందిన కృత్రిమ మేధ సహాయకుడు 6ఎస్కై ద్వారా దేశీయ విమాన టికెట్‌ను బుక్ చేసుకోవాలి. ఇలా అర్హత పొందిన బుకింగ్‌ల నుంచి ఇండిగో యాదృచ్ఛికంగా విజేతలను ఎంపిక చేస్తుంది.

ఎంపికైన ప్రయాణికులకు ఈ విషయం ఈమెయిల్‌, వాట్సాప్‌ ద్వారా తెలియజేస్తారు. అనంతరం వారికి ఓ ప్రశ్నను పంపిస్తారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మూడు అవకాశాలు ఉంటాయి. సరైన సమాధానం ఇస్తే టికెట్‌ కోసం చెల్లించిన మొత్తం తిరిగి పొందవచ్చు.

రూ.10 వేల వరకు పూర్తి రీఫండ్‌

ఈ ఆఫర్‌లో భాగంగా ఒక్కో పీఎన్‌ఆర్‌కు గరిష్ఠంగా రూ.10 వేల వరకు చెల్లించిన టికెట్‌ ధరను తిరిగి అందిస్తారు. రీఫండ్‌ సాధారణంగా మూడు నుంచి ఐదు పనిదినాల్లో ప్రయాణికుడి ఖాతాలో జమ అవుతుంది. వన్‌వే, రిటర్న్‌ జర్నీలకు ఈ అవకాశం వర్తిస్తుంది. ఎకానమీతో పాటు ఇండిగోస్ట్రెచ్‌ తరగతిలో చేసిన అర్హత కలిగిన బుకింగ్‌లకు కూడా ఆఫర్‌ వర్తిస్తుంది.

ఈ బుకింగ్స్‌కు ఆఫర్ వర్తించదు

ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలంటే ఇండిగో అధికారిక మార్గాల్లోనే టికెట్‌ బుక్ చేసుకోవాలి. సంస్థ వెబ్‌సైట్‌, యాప్‌, 6ఎస్కై ద్వారా చేసిన బుకింగ్‌లకే అర్హత ఉంటుంది. ఇతర విమాన టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్లు, ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా చేసిన బుకింగ్‌లకు ఈ ఆఫర్‌ వర్తించదు.

20 ఏళ్ల ప్రస్థానంలో ఇండిగో

రెండు దశాబ్దాల క్రితం తక్కువ ధరల విమాన సేవల సంస్థగా ప్రారంభమైన ఇండిగో ప్రస్తుతం దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది. 400కు పైగా విమానాలతో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో సేవలను విస్తరిస్తోంది. ప్రీమియం ప్రయాణ సేవలు, ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్రయోజనాలు, డిజిటల్‌ సేవలను మరింతగా విస్తరించే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది.

20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘హ్యాపీ ఇండిగో డే’ కార్యక్రమంలో భాగంగానే ‘ఇండిగోఫ్రీ’ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రయాణికులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా కనిపిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story