ఇన్వెస్కో కొత్త డెట్ ఫండ్.. రూ.1,000తో పెట్టుబడి

ఇన్వెస్కో కొత్త డెట్ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ ప్రారంభమైంది. రూ.1,000 కనీస పెట్టుబడి, ఎస్ఐపీ వివరాలు, రిస్క్, చివరి తేదీ తెలుసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Nov 2026 12:30 AM IST
Invesco Debt Fund NFO
X

Invesco Debt Fund NFO

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ సరికొత్త డెట్ ఫండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్వెస్కో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ డెట్ ఫండ్ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) నవంబర్ 25, 2026న ప్రారంభమైంది. డిసెంబర్ 7, 2026 వరకు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కేవలం రూ.1,000తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈ ఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇన్వెస్కో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ డెట్ ఫండ్

ఇది ఓపెన్ ఎండెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ప్రధానంగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు), ప్రభుత్వ ఆర్థిక సంస్థలు జారీ చేసే డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుంది. ముఖ్యంగా AA+ అంతకంటే ఎక్కువ రేటింగ్ కలిగిన కార్పొరేట్ డెట్ సాధనాలు, A1+ రేటింగ్ ఉన్న మనీ మార్కెట్ సాధనాలపై దృష్టి సారిస్తుంది.

ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాత కూడా ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఈ పథకానికి ఎలాంటి ఎగ్జిట్ లోడ్ లేదని ఫండ్ హౌస్ వెల్లడించింది.

కనీస పెట్టుబడి ఎంతంటే?

ఈ కొత్త డెట్ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.1,000గా నిర్ణయించారు. ఆ తర్వాత అదనంగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు కేవలం రూ.1 చొప్పున కూడా పెంచుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాత సాధారణ పెట్టుబడుల సమయంలోనూ ఇదే కనీస పెట్టుబడి మొత్తం వర్తిస్తుంది.

ఎస్ఐపీ సదుపాయాలు ఎలా ఉన్నాయి?

ఈ పథకంలో నెలవారీ, త్రైమాసిక ఎస్ఐపీ (SIP) సదుపాయాలను అందిస్తున్నారు. నెలవారీ ఎస్ఐపీ ద్వారా కనీసం రూ.1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. త్రైమాసిక ఎస్ఐపీకి కనీస పెట్టుబడి రూ.2,000గా నిర్ణయించారు. అదనపు పెట్టుబడులను రూ.1 చొప్పున పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఫండ్ మేనేజర్లు ఎవరు?

ఈ పథకాన్ని వికాస్ గార్గ్, గౌరవ్ జఖోటియా నిర్వహించనున్నారు. వికాస్ గార్గ్ ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్‌లో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ విభాగం అధిపతిగా, ఫండ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గౌరవ్ జఖోటియా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి క్రెడిట్ విశ్లేషణ, రిస్క్ అంచనా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల నిర్వహణ వంటి వ్యూహాలను వీరు అనుసరించనున్నారు.

ఈ ఫండ్ బెంచ్‌మార్క్ ఏమిటి?

ఇన్వెస్కో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ డెట్ ఫండ్ పనితీరును క్రిసిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షార్ట్ టర్మ్ డెట్ ఇండెక్స్‌తో పోల్చనున్నారు. దీనివల్ల ఫైనాన్షియల్ సర్వీసెస్ డెట్ విభాగంలో ఈ పథకం పనితీరును అంచనా వేయవచ్చు.

రిస్క్ ఎంత ఉంటుంది?

ఈ ఫండ్‌కు మధ్యస్థాయి రిస్క్ ప్రొఫైల్ ఉంది. రిస్క్ రేటింగ్‌లో బీ-II కేటగిరీని కేటాయించారు. అంటే ఇందులో క్రెడిట్ రిస్క్ మధ్యస్థంగా, వడ్డీ రేట్ల మార్పుల వల్ల కలిగే రిస్క్ కూడా మధ్యస్థంగా ఉంటుందని అర్థం. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆయా రంగాల్లో వచ్చే మార్పులు ఈ ఫండ్ పనితీరుపై ప్రభావం చూపవచ్చు.

ఇన్వెస్టర్లు ఏం గమనించాలి?

తక్కువ మొత్తంతో పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం కనీస పెట్టుబడి మొత్తం ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. ఫండ్ పెట్టుబడి వ్యూహం, సంబంధిత సంస్థల క్రెడిట్ నాణ్యత, వడ్డీ రేట్ల మార్పుల ప్రభావం, తమ ఆర్థిక లక్ష్యాలను పరిశీలించాలి. డెట్ మ్యూచువల్ ఫండ్లలోనూ మార్కెట్ రిస్కులు ఉంటాయి. రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్‌ను పరిశీలించి, అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్