Investment Tips: భవిష్యత్ కోసం.. ఇల్లు కొనడం మంచిదా? SIPలో పెట్టుబడి పెట్టడం మంచిదా?
Investment Tips: ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారు.
Investment Tips: భవిష్యత్ కోసం.. ఇల్లు కొనడం మంచిదా? SIPలో పెట్టుబడి పెట్టడం మంచిదా?
Investment Tips: ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టే సమయంలో చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ఇల్లు లేదా స్థలం కొనాలా? లేక మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టాలా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అంటే ఏంటి?
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అంటే ఇల్లు, స్థలం లేదా వాణిజ్య భవనం వంటి ఆస్తులను కొనుగోలు చేసి దీర్ఘకాలం పాటు ఉంచడం. కాలక్రమేణా వాటి విలువ పెరిగితే మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు లేదా షాపు కొనుగోలు చేస్తే అద్దె రూపంలో కూడా ప్రతి నెల ఆదాయం వస్తుంది. అలాగే ఒక ప్రాంతంలో రోడ్లు, మెట్రో, పరిశ్రమలు లేదా ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే అక్కడి ఆస్తుల ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇల్లు కొనుగోలు చేయడం అంటే కేవలం కొనుగోలు ధర మాత్రమే కాదు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు, ప్రాపర్టీ ట్యాక్స్, హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి చూస్తే మొత్తం లాభం కొంత తగ్గే అవకాశం ఉంది.
మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి వల్ల కలిగే ప్రయోజనాలు
మ్యూచువల్ ఫండ్లలో ముఖ్యంగా SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా ప్రతి నెల చిన్న మొత్తాలతోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. వేల రూపాయలు అవసరం లేకుండా రూ.500 లేదా రూ.1,000తో కూడా పెట్టుబడి మొదలుపెట్టే అవకాశం ఉంది. SIPలో మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే అవసరమైన సమయంలో డబ్బును సులభంగా ఉపసంహరించుకోవచ్చు. అలాగే మీ పెట్టుబడి ఒకే కంపెనీలో కాకుండా అనేక కంపెనీలు, విభిన్న రంగాల్లో పెట్టుబడిపెడుతారు. దీంతో ఒకే రంగంలో నష్టం వచ్చినా మొత్తం పెట్టుబడిపై తీవ్ర ప్రభావం పడకుండా ఉంటుంది.
రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్ మధ్య ప్రధాన తేడాలు
ఈ రెండు పెట్టుబడి విధానాలు వేర్వేరు అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టాల్సి ఉంటుంది. SIPలో మాత్రం చిన్న మొత్తాలతోనే పెట్టుబడి పెట్టవచ్చు. ఇల్లు లేదా స్థలం అమ్మాలంటే వారాలు లేదా నెలలు పట్టే అవకాశం ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్లలో అవసరమైనప్పుడు డబ్బును త్వరగా తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో ఒకే ఆస్తిలో పెట్టుబడి ఉంటుంది. SIPలో అనేక కంపెనీలు, రంగాల్లో పెట్టుబడి విభజిస్తారు. ప్రాపర్టీ నిర్వహణకు అదనపు ఖర్చులు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లలో అలాంటి నిర్వహణ బాధ్యత పెట్టుబడిదారుడిపై ఉండదు. ఇల్లు కొనడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. SIPలో ఆదాయానికి తగ్గట్టుగా ప్రతి నెల పెట్టుబడి కొనసాగించవచ్చు.
ఏ పెట్టుబడి ఎక్కువ లాభం ఇస్తుంది?
దీనికి ఒక్క మాటలో సమాధానం చెప్పడం కష్టం. మంచి ప్రాంతంలో కొనుగోలు చేసిన ఆస్తి కొన్నేళ్ల తర్వాత భారీగా విలువ పెరిగే అవకాశం ఉంది. అద్దె రూపంలో అదనపు ఆదాయం కూడా వస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా సంవత్సరాల పాటు ఆస్తి ధరలు పెరగకపోవచ్చు. మరోవైపు మ్యూచువల్ ఫండ్లలో మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ దీర్ఘకాలం పాటు SIP కొనసాగించే వారికి కంపౌండింగ్ ప్రభావం వల్ల పెట్టుబడి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది ఆర్థిక నిపుణులు కనీసం 10 నుంచి 15 సంవత్సరాల పాటు SIP కొనసాగించాలని సూచిస్తున్నారు.
ఎవరికి ఏ పెట్టుబడి సరిపోతుంది?
స్థిరమైన ఆస్తి ఉండాలని, అద్దె ఆదాయం పొందాలని భావించే వారికి రియల్ ఎస్టేట్ మంచి ఎంపిక కావచ్చు. అయితే తక్కువ మొత్తాలతో పెట్టుబడి ప్రారంభించి, దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించాలని భావించే వారికి SIP మంచి మార్గంగా ఉంటుంది.
పెట్టుబడి పెట్టే ముందు మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్ లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకే పెట్టుబడిపై ఆధారపడకుండా రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్లు వంటి విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.




