Copper Aluminium Investment Trend: మారుతున్న ఆలోచనలు...రాగి అల్యూమినియంపై పెట్టుబడులు
Copper Aluminium Investment Trend: ప్రతి మనిషికి బంగారం అవసరమే. బంగారంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.
Copper Aluminium Investment Trend
Copper Aluminium Investment Trend: ప్రతి మనిషికి బంగారం అవసరమే. బంగారంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సంక్షోభాల సమయంలో ఆ బంగారమే ఆసరా అవుతుంది. కానీ, యుద్ధాలు వంటివి వచ్చినపుడు, చమురు సంక్షోభం ఏర్పడినపుడు యుద్ధాలకు సంబంధించిన తయారీ రంగంలోనూ, చమురు రంగంలోనూ పెట్టుబడులు పెడుతుంటారు. దీంతో బంగారానికి కొంత డిమాండ్ తగ్గుతుంది. కానీ, సంక్షోభాలు ఎదురైనా కాకున్నా ఎల్లప్పుడూ నిలకడగా ఉండే వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటి విలువ ఎప్పుడూ తగ్గదు. ఇప్పుడు పెట్టుబడిదారులు వాటిపైపు చూస్తున్నారు. అదే రాగి, అల్యూమినియం. వీటిని పారిశ్రామిక లోహాలని పిలుస్తారు.
రాగి దూకుడు
బంగారం, వెండి ధరల్లో పెద్దగా కదలిక లేకపోవడంతో, ఇన్వెస్టర్లు రాగి (Copper), అల్యూమినియం వంటి పారిశ్రామిక లోహాల (Base Metals) వైపు క్యూ కడుతున్నారు. గత నెలలోనే రాగి ధర 9%, అల్యూమినియం 7.5% పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దీనికి ప్రధాన కారణం చైనా. చైనా ఈ పారిశ్రామిక లోహాలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటున్నది. ఫలితంగా డిమాండ్ పెరగడంతో పాటు సరఫరాలో కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో రాగి ధర దాదాపు రూ. 1280 వద్ద ట్రేడ్ అవుతోంది. చైనా నుంచి రాగి ఖనిజ దిగుమతులు 6.6 శాతం పెరగడం, పరిశ్రమల డిమాండ్ పెరుగుదలతో రాగి ధరలు పెరిగాయి. రాగికి రూ. 1240 వద్ద బలమైన సపోర్ట్ ఉండగా, ఒకవేళ ధర రూ. 1310 మార్కును దాటితే.. అది నేరుగా రూ. 1345 వరకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రాగిపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మరింత ముందుకు వస్తారు.
అల్యూమినియం ఎందుకు పెరుగుతోంది?
అల్యూమినియం ధరలు పెరగడానికి ప్రధాన కారణం పశ్చిమాసియా, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ సంక్షోభం. ప్రపంచంలో 9శాతం ఉత్పత్తి ఈ దేశాల్లోనే ఉంటుంది. ఇక్కడ యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో సరఫరాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫలితంగా అల్యూమినియంకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అల్యూమినియం ధర రూ. 368 వద్ద ఉన్నది. ఒకవేళ అల్యూమినియం ధర రూ. 372 పైన ధర స్థిరపడితే, అది సులభంగా 385 మార్కును చేరుకుంటుంది.
ధరల పెరుగుదలకు అసలు కారణాలు ఇవే
రాగి ఉత్పత్తిలో కీలకమైన సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో ఉత్పత్తి ఖర్చు పెరిగింది. సల్ఫ్యూరిక్ ఆమ్లం లేకుండా రాగి ఉత్పత్తి చేయడం అసాధ్యం. చైనా ఎక్కువగా ఈ ఆమ్లాన్ని ఎగుమతి చేస్తుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రసాయనాన్ని ఎగుమతి చేయడం వలన ఇబ్బందులు ఎదురౌతాయని గుర్తించిన చైనా ఎగుమతులను నిలిపివేసింది. అంతేకాదు, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ తగ్గడం వల్ల ఇతర దేశాల కొనుగోలుదారులకు ఈ లోహాలు చౌకగా దొరుకుతున్నాయి, దీంతో డిమాండ్ పెరుగుతోంది.
మొత్తంగా చూసుకుంటే, పరిశ్రమల్లో విరివిగా వాడే ఈ లోహాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చని సామాన్య ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో ఈ లోహానికి డిమాండ్ పెరిగింది. అందుకే ఇప్పుడు మార్కెట్‌లో 'రెడ్ మెటల్' (రాగి) టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇన్వెస్టర్ల ఆలోచనలు మారుతున్న నేపథ్యంలో మరికొన్ని లోహాలపై కూడా పెట్టుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.




