IPO: ఐపీఓల సునామీ.. ఒకే వారంలో ఏకంగా 20 ఐపీఓల రాక..!
IPO: భారత ప్రైమరీ మార్కెట్ చరిత్రలో ఈ వారం ఒక సరికొత్త రికార్డుకు వేదిక కాబోతోంది. స్ట్రీట్ ఇన్వెస్టర్లకు ఊహించని ఉత్సాహాన్ని ఇస్తూ, సెప్టెంబర్ ఆఖరి వారం ఏకంగా 20 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లతో కళకళలాడనుంది.
IPO: ఐపీఓల సునామీ.. ఒకే వారంలో ఏకంగా 20 ఐపీఓల రాక..!
IPO: భారత ప్రైమరీ మార్కెట్ చరిత్రలో ఈ వారం ఒక సరికొత్త రికార్డుకు వేదిక కాబోతోంది. స్ట్రీట్ ఇన్వెస్టర్లకు ఊహించని ఉత్సాహాన్ని ఇస్తూ, సెప్టెంబర్ ఆఖరి వారం ఏకంగా 20 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లతో కళకళలాడనుంది. ఈ ఏడాదిలో ఒకే వారంలో ఇన్ని ఐపీఓలు పలకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తానికి 2026 సంవత్సరంలోనే అత్యంత రద్దీగా ఉండే, బిజీయెస్ట్ వీక్‌గా ఈ వారం నిలవనుంది. ఈ భారీ పరంపరలో 4 మెయిన్ బోర్డు ఐపీఓలతో పాటు, మరో 16 ఎస్ఎంఈ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తున్నాయి. రిటైల్ మదుపరులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే మెయిన్ బోర్డ్ కేటగిరీలో ఈ వారం నాలుగు ఆకర్షణీయమైన ఐపీఓలు క్యూ కట్టాయి.
ఎస్‌ఆర్ఐటీ ఇండియా : రూ.218.44 కోట్ల విలువైన పూర్తి స్థాయి ఫ్రెష్ ఇష్యూతో వస్తోంది. దీని ధరల శ్రేణిని రూ.123 నుంచి రూ.130గా నిర్ణయించారు. కనిష్టంగా 115 షేర్లకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.14,950 పెట్టుబడి అవసరం. ఈ ఇష్యూ సెప్టెంబర్ 28న ప్రారంభమై సెప్టెంబర్ 30తో ముగియనుంది.
షా ఇన్వెస్టర్స్ హోమ్ : సెప్టెంబర్ 28న ప్రారంభమై, సెప్టెంబర్ 30న ముగియనున్న ఈ ఐపీఓ షేరు ధరను రూ.159 నుంచి రూ.167 మధ్యలో ఫిక్స్ చేశారు.
నిత్యాస్ జెమ్స్ అండ్ జువెలరీ : సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 5న ముగియనుంది. షేరు ధర రూ.70 నుంచి రూ.75గా ఉండగా, కనీస పెట్టుబడి రూ.15,000గా ఉంది.
విశాల్ నిర్మితి : మార్కెట్ నుంచి రూ.178 కోట్లు సమీకరించే లక్ష్యంతో సెప్టెంబర్ 30న ఎంట్రీ ఇస్తోంది. అక్టోబర్ 5 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉన్న ఈ ఐపీఓ షేరు ధర రూ.208 నుంచి రూ.220గా నిర్ణయించారు.
మరోవైపు చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగంలో కూడా ఏకంగా 16 కంపెనీలు దలాల్ స్ట్రీట్‌ను ముంచెత్తడానికి సిద్ధమయ్యాయి. బ్లాక్ ఒపాల్ కన్సల్టెంట్స్, ఎవరెస్ట్ ఐఎంఎస్ టెక్నాలజీస్, వాన్స్ ఎలక్ట్రో ఇంజనీరింగ్స్, డోవ్ సాఫ్ట్, అక్మే ఇండియా ఇండస్ట్రీస్, టీఎన్ఏ సొల్యూషన్స్, ఎస్‌జేపీ అల్ట్రాసోనిక్స్, ఎవెన్‌షన్స్, సోల్ ఫెగ్ స్మార్ట్ ఎలక్ట్రానిక్స్, ఒమారా వెంచర్స్ ఇండియా, పపడమల్జీ ఆగ్రో ఫుడ్స్ వంటి ఎన్నో సంస్థలు ఇందులో ఉన్నాయి. ఎస్ఎంఈ ఐపీఓల లాట్ సైజ్ సాధారణంగా కాస్త ఎక్కువగా ఉండి, కనీస పెట్టుబడి రూ.2 లక్షల నుంచి రూ.2.80 లక్షల వరకు ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఒకే వారంలో ఇన్ని ఐపీఓలు క్యూ కట్టడంతో మదుపరులకు ఎంపిక చేయడం సవాలుగా మారుతుంది. కేవలం క్షణికావేశంలో లిస్టింగ్ లాభాల కోసం పరుగులు పెట్టకుండా.. ఆయా కంపెనీల రెవెన్యూ, నికర లాభాలు, అప్పుల చిట్టా ఎలా ఉందో క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాగే సంబంధిత రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ప్రైస్ బ్యాండ్ సమంజసంగా ఉందా లేదా అనేది బేరీజు వేసుకోవాలి. దీర్ఘకాలికంగా వృద్ధి సాధించే సత్తా ఉన్న కంపెనీలను ఎంచుకుంటేనే ప్రైమరీ మార్కెట్‌లో సిరులు కురుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ మహా ఐపీఓ జాతరలో ఏ కంపెనీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.




