Indian Railways: ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్లు బుక్.. ఐఆర్‌సీటీసీ సరికొత్త రికార్డు
Indian Railways: భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను అందించే ఐఆర్‌సీటీసీ చరిత్రలో సరికొత్త మైలురాయిని తాకింది.
Indian Railways
Indian Railways: భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను అందించే ఐఆర్‌సీటీసీ చరిత్రలో సరికొత్త మైలురాయిని తాకింది. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా టెక్నాలజీని మెరుగుపరచడంతో, ఒకే రోజులో ఏకంగా 20 లక్షలకు పైగా టికెట్లను బుక్ చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. పండగల సీజన్ సమీపిస్తుండటంతో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఏకంగా 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్‌సీటీసీ చరిత్రలో ఒకే రోజులో ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీనికి ముందు రోజు కూడా దాదాపు 19.50 లక్షల మంది తమ ప్రయాణాలను రిజర్వు చేసుకున్నారు. గతేడాది అత్యధికంగా ఒక్క రోజులో 18.40 లక్షల టికెట్లు అమ్ముడుపోగా, ఆ రికార్డు ఇప్పుడు పూర్తిగా బద్దలైంది.
మారుతున్న ప్రయాణికుల అభిరుచులు
ప్రస్తుతం రైల్వే రిజర్వేషన్ల విషయంలో ప్రయాణికులు పూర్తిగా డిజిటల్ బాట పట్టారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దాదాపు 89 శాతం రిజర్వ్డ్ టికెట్లు ఆన్‌లైన్ ద్వారానే బుక్ అవుతుండగా, కేవలం 11 శాతం మంది మాత్రమే ఆఫ్‌లైన్ కౌంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ వాడకం పెరగడం, మొబైల్ యాప్‌ల ద్వారా చిటికెలో టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రావడంతో ప్రజలు క్యూ లైన్లలో నిలబడే ఇబ్బందులకు స్వస్తి పలుకుతున్నారు.
మెరుగైన టెక్నాలజీ.. ఫాస్టెస్ట్ సర్వర్లు
ఈ భారీ రద్దీని ఎలాంటి అంతరాయాలు లేకుండా తట్టుకునేందుకు రైల్వే శాఖ సాంకేతికపరంగా ఎన్నో కీలక మార్పులు చేసింది. పాత సర్వర్లను తొలగించి సరికొత్త అతధునిక సర్వర్లను ఏర్పాటు చేశారు. కొత్త బీటా ఇంటర్‌ఫేస్ అందుబాటులోకి రావడంతో స్లీపర్ అలాగే ఏసీ తరగతులకు సంబంధించిన సీట్ల లభ్యత ఒకే స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల ప్రయాణికులు తక్కువ సమయంలోనే తమకు నచ్చిన బెర్త్‌ను బుక్ చేసుకోగలుగుతున్నారు.
నకిలీ బుకింగ్‌లకు చెక్.. బాట్ ట్రాఫిక్ కట్టడి
అత్యవసర సమయంలో సామాన్య ప్రయాణికులకు టికెట్లు దక్కకుండా చేసే దళారులు, ఏజెంట్లపై రైల్వే శాఖ ఉక్కుపాదం మోపుతోంది. యాంటీ బాట్ అలాగే సీడీఎన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల అనధికారిక బాట్ ట్రాఫిక్ భారీగా తగ్గిపోయింది. నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కోట్ల సంఖ్యలో నకిలీ యూజర్ ఐడీలను బ్లాక్ చేశారు. ఈ పకడ్బందీ చర్యల కారణంగానే నిజమైన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా టికెట్లు లభిస్తున్నాయి.




