బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా.? 46 ఏళ్ల గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?
Gold: చాలామంది బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో నష్టాలు వచ్చినప్పుడు లేదా ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు.
బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా.? 46 ఏళ్ల గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?
Gold: చాలామంది బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో నష్టాలు వచ్చినప్పుడు లేదా ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. అయితే బంగారంలో పెట్టుబడి పెడితే ఎలాంటి నష్టాలు రావని అనుకోవడం పొరపాటే. ఎందుకో తెలుసా.?
బంగారంలోనూ భారీగా పడిపోతున్న ధరలు
ఫండ్స్‌ఇండియా నివేదిక ప్రకారం.. జనవరి 1980 నుంచి అక్టోబర్ 2026 వరకు బంగారం ధరలను పరిశీలించారు. ఈ కాలంలో దాదాపు సగం ట్రేడింగ్ రోజుల్లో బంగారం ధర గతంలో నమోదైన గరిష్ఠ స్థాయి కంటే 10 శాతానికి పైగా తగ్గింది. సెన్సెక్స్‌లోనూ దాదాపు 48 శాతం రోజుల్లో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అంటే స్టాక్ మార్కెట్‌లో మాదిరిగానే బంగారంలోనూ ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. బంగారాన్ని పూర్తిగా రిస్క్ లేని పెట్టుబడిగా భావించడం సరైనది కాదు.
పాత ధరలకు చేరుకోవడానికి ఏళ్ల సమయం
బంగారం ధరలు భారీగా పడిపోయినప్పుడు మళ్లీ పాత స్థాయికి చేరుకోవడానికి చాలా కాలం పట్టవచ్చు. దీనికి గతంలో జరిగిన పరిణామాలే ఉదాహరణ. 1980 జనవరిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత 1982 జూన్ నాటికి దాదాపు 57 శాతం తగ్గాయి. తిరిగి పాత గరిష్ఠ స్థాయికి చేరుకోవడానికి 1989 నవంబర్ వరకు సమయం పట్టింది. అంటే పెట్టుబడిదారులు దాదాపు పదేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. అలాగే 1996 ఫిబ్రవరిలో నమోదైన గరిష్ఠ ధర తర్వాత బంగారం విలువ సుమారు 31 శాతం పడిపోయింది. తిరిగి పాత ధరకు చేరుకోవడానికి 6 ఏళ్ల 4 నెలలు పట్టింది. 2012 నవంబర్‌లో నమోదైన గరిష్ఠ స్థాయి తర్వాత కూడా బంగారం ధర దాదాపు 29 శాతం తగ్గింది. మళ్లీ పాత స్థాయికి చేరుకోవడానికి 6 ఏళ్ల 7 నెలల సమయం పట్టింది.
ఇటీవల కూడా భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులకు ఇటీవలి పరిణామాలు కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2026 జనవరి 30న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,79,140 గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే 2026 నవంబర్ 16 నాటికి ఈ ధర సుమారు రూ.1,35,430కి పడిపోయింది. అంటే గరిష్ఠ ధరతో పోలిస్తే దాదాపు 24 శాతం తగ్గుదల నమోదైంది. బంగారం ధరలు 5, 10 లేదా 20 శాతం తగ్గిన సందర్భాల్లో సెన్సెక్స్‌తో పోలిస్తే పెద్దగా తేడా కనిపించలేదు. అయితే 30 శాతానికి మించి భారీగా పడిపోయిన సందర్భాల్లో సెన్సెక్స్‌లో ఇలాంటి తగ్గుదల ఎక్కువసార్లు నమోదైంది. దీనిని బట్టి బంగారంలోనూ పెట్టుబడి పెట్టేటప్పుడు ధరల తగ్గుదలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
దీర్ఘకాలంలో మంచి రాబడి.. పెట్టుబడుల్లో సమతుల్యత అవసరం
బంగారం ధరల్లో స్వల్పకాలంలో భారీ మార్పులు వచ్చినప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించినట్లు ఫండ్స్‌ఇండియా అధ్యయనం వెల్లడించింది. 1980 నుంచి ఇప్పటివరకు పూర్తయిన 10 ఏళ్ల పెట్టుబడి కాలాలను పరిశీలిస్తే బంగారం సగటున ఏడాదికి సుమారు 10 శాతం రాబడిని అందించింది. అంతేకాకుండా అధ్యయనంలో పరిశీలించిన ఏ పూర్తయిన పదేళ్ల కాలంలోనూ బంగారం నెగిటివ్ రిటర్న్ ఇవ్వలేదు. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం కేవలం లాభాలు సంపాదించడం మాత్రమే కాదు.
పెట్టుబడులను వివిధ మార్గాల్లో విభజించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో బంగారం మంచి పనితీరు కనబరచవచ్చు. కానీ ప్రతిసారీ స్టాక్ మార్కెట్ నష్టాలను బంగారం భర్తీ చేస్తుందని చెప్పలేం. అందుకే పెట్టుబడిదారులు తమ డబ్బునంతా బంగారంలోనే పెట్టకుండా షేర్లు, బంగారం, ఇతర పెట్టుబడి మార్గాల మధ్య సరైన సమతుల్యత పాటించాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు, పెట్టుబడి సామర్థ్యం, రిస్క్‌ను భరించే స్థాయిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి.
గమనిక: ఈ కథనంలోని సమాచారం అందుబాటులో ఉన్న నివేదికలు, గణాంకాల ఆధారంగా అందించడమైంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.




