UPI: యూపీఐ ఇకపై పూర్తిగా ఫ్రీ కాదా? రూ.2000 దాటితే చార్జీలు తప్పవా ?

UPI: భారతదేశంలో డిజిటల్ లెక్కలను పూర్తిగా మార్చేసిన యూపీఐ సేవలకు సంబంధించి ముఖ్యమైన వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది.

CR Reddy
Published on: 15 Sept 2026 9:41 AM IST
UPI
X

UPI

UPI: భారతదేశంలో డిజిటల్ లెక్కలను పూర్తిగా మార్చేసిన యూపీఐ సేవలకు సంబంధించి ముఖ్యమైన వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. టీ కొట్టు దగ్గరి నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ప్రతి ఒక్కరూ చిల్లర సమస్య లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే ఇకపై యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితం కాదనే చర్చ నడుస్తోంది. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన మర్చెంట్ (వ్యాపార) చెల్లింపులపై ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం చట్టపరమైన మార్గాన్ని సుగమం చేసింది.

రూ.2000 వరకు లావాదేవీలు ఫ్రీ

ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. రూ.2,000 లోపు ఉండే యూపీఐ చెల్లింపులు, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలను బ్యాంక్ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయించారు. అంటే నిర్ణీత పరిమితి లోపు జరిగే ఎలక్ట్రానిక్ పేమెంట్స్‌పై ఎలాంటి బ్యాంక్ ఛార్జీలు వర్తించవు. అయితే, రూ.2,000 దాటిన వ్యాపార సంబంధిత (మర్చెంట్) చెల్లింపులపై మాత్రం బ్యాంకులు వ్యాపారుల నుంచి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయడానికి చట్టపరంగా అనుమతి లభించింది. 2020 జనవరిలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎండీఆర్ ఛార్జీలను సున్నాకి తగ్గించిన విషయం తెలిసిందే.

చట్టంలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం

డిజిటల్ పేమెంట్ నిబంధనలలో మార్పుల కోసం గత కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వం పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్(PSS) చట్టం 2007లో సవరణలు చేసింది. ఈ చట్టపరమైన సవరణల కారణంగానే బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు యూపీఐపై ఛార్జీలు విధించడానికి మార్గం సుగమమైంది. మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో మర్చెంట్ పేమెంట్ల వాటా 29 శాతంగా ఉండగా, అందులో 67.2 శాతం పేమెంట్లు రూ.2,000 కంటే ఎక్కువే ఉంటున్నాయి.

సామాన్య వినియోగదారులపై ప్రభావం పడుతుందా?

ఈ వార్త విన్న చాలా మంది సామాన్య ప్రజలకు తాము చేసే యూపీఐ పేమెంట్స్‌పై కూడా డబ్బులు కట్ అవుతాయనే ఆందోళన కలుగుతోంది. అయితే ఇక్కడ స్పష్టత ఏమిటంటే ఈ ఎండీఆర్ ఛార్జీలు కేవలం వ్యాపారులపై మాత్రమే వర్తిస్తాయి తప్ప, సాధారణ వినియోగదారుల వ్యక్తిగత చెల్లింపులపై ఎలాంటి ప్రభావం చూపవు. భవిష్యత్తులో కేవలం నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపై మాత్రమే అత్యంత నామమాత్రపు ఛార్జీలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త రేట్లు, నిబంధనలను అధికారికంగా ప్రకటించనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.