IT Stocks: అమెరికా దెబ్బకు కుదేలైన భారత ఐటీ షేర్లు.. ఒక్కరోజే రూ.55 వేల కోట్ల సంపద ఆవిరి!
IT Stocks: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో భారత ఐటీ కంపెనీల షేర్లపై ప్రభావం పడింది.
IT Stocks: అమెరికా దెబ్బకు కుదేలైన భారత ఐటీ షేర్లు.. ఒక్కరోజే రూ.55 వేల కోట్ల సంపద ఆవిరి!
IT Stocks: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో భారత ఐటీ కంపెనీల షేర్లపై ప్రభావం పడింది.భారత ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ప్రముఖ ఐటీ కంపెనీల మార్కెట్ విలువలో దాదాపు రూ.55,000 కోట్ల మేర తగ్గుదల కనిపించింది.
ఐటీ దిగ్గజాల షేర్లలో భారీ పతనం
అమెరికా నిర్ణయం ప్రభావంతో భారత ఐటీ రంగంలోని దాదాపు అన్ని ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లోకి జారాయి. ఈ పతనంలో ఇన్ఫోసిస్ ముందు వరుసలో ఉంది. ఆ కంపెనీ షేరు ధర 3 శాతానికి పైగా పడిపోయింది. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు కూడా దాదాపు 3 శాతం చొప్పున నష్టపోయాయి.
టీసీఎస్, ఎంఫసిస్, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేర్లలోనూ సుమారు 2 శాతం వరకు క్షీణత నమోదైంది. అమెరికా మార్కెట్‌పై భారత ఐటీ కంపెనీలకు ఎక్కువగా ఆధారపడటం, అక్కడి ఉద్యోగాలు, వీసా నిబంధనల్లో మార్పులు వస్తే తమ వ్యాపారాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది. ఈ కారణంగానే ఐటీ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి.
కాగ్నిజెంట్ PERM దరఖాస్తులను ఎందుకు నిలిపివేశారు?
అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ సమర్పించిన PERM దరఖాస్తులను సస్పెండ్ చేసింది. PERM అంటే ‘పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్’. అమెరికాలో విదేశీ ఉద్యోగికి శాశ్వత ఉద్యోగం కల్పించి, తద్వారా గ్రీన్ కార్డు కోసం స్పాన్సర్ చేయాలంటే ఈ ప్రక్రియ ముఖ్యమైనది.
ఒక ఉద్యోగానికి అమెరికాలో అర్హత ఉన్న ఉద్యోగులు అందుబాటులో లేరని, విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల అదే రంగంలో పనిచేస్తున్న అమెరికన్ల జీతాలు, ఉద్యోగ పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉండదని యజమాని నిరూపించాల్సి ఉంటుంది. అయితే కాగ్నిజెంట్ PERM దరఖాస్తులపై అమెరికా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పొసిటో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికన్ ఉద్యోగులకు ముప్పు కలిగించే అంశాలను సహించబోమని ఆయన పేర్కొన్నారు. వైట్‌హౌస్ యాంటీ-ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి వాస్తవాలు, మోసం, ఆర్థిక అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగ్నిజెంట్ అమెరికన్లకు ఉద్యోగాలు ఇస్తున్నా.. ఎందుకు దర్యాప్తు?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. PERM దరఖాస్తులు సస్పెండ్ కావడానికి ఒకరోజు ముందు కాగ్నిజెంట్ అమెరికాలో కొత్త ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. అమెరికన్ కాలేజీల నుంచి 1,500 మంది గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ‘ఫ్రంటియర్ సర్టిఫైడ్ ఇంజనీర్’, ‘ఫ్రంటియర్ బిజినెస్ ఆపరేటర్’ వంటి విభాగాల్లో తన ఉద్యోగుల సంఖ్యను 15,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ సీఈఓ రవి కుమార్ ఎస్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు తగ్గడం కంటే కొత్త ఉద్యోగాలు ఎక్కువగా ఏర్పడతాయని తెలిపారు. అమెరికా ఉద్యోగులకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ ‘RAISE US’ అనే అమెరికా ఉద్యోగుల కూటమిలోనూ చేరింది. కంపెనీ నిర్వహిస్తున్న ‘సినాప్స్’ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా శిక్షణ పొందారు. 2030 నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
PERMకి H-1Bకి దీనికి తేడా ఏంటి?
PERM, H-1B రెండూ విదేశీ ఉద్యోగులకు సంబంధించినవే అయినప్పటికీ రెండింటి ఉద్దేశాలు వేర్వేరు. PERM ప్రధానంగా శాశ్వత ఉద్యోగం, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుతో సంబంధం కలిగి ఉంటుంది. ఒక విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా అమెరికాలో పనిచేయించేందుకు ఈ ప్రక్రియలో భాగంగా లేబర్ సర్టిఫికేషన్ అవసరం అవుతుంది.
అయితే H-1B వీసా తాత్కాలిక ఉద్యోగానికి సంబంధించినది. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీ నిపుణులను కొంతకాలం పనిచేయించేందుకు ఈ వీసాను ఉపయోగిస్తారు. కాబట్టి కాగ్నిజెంట్ PERM దరఖాస్తులను నిలిపివేసినంత మాత్రాన ఆ కంపెనీకి చెందిన H-1B దరఖాస్తులు కూడా నిలిచిపోయాయని అర్థం కాదు.
ఇదే సమయంలో అమెరికా అధికారులు క్లౌడెరా సంస్థకు చెందిన PERM దరఖాస్తులను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఏ కంపెనీపై నిర్దిష్ట నేరారోపణలు ఉన్నాయో, ఎన్ని దరఖాస్తులు ప్రభావితమయ్యాయో, సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగుతుందో అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు. మరోవైపు కోఫోర్జ్ షేరు దాదాపు 9 శాతం పడిపోయింది. అయితే ఆ పతనానికి PERM వ్యవహారం కారణం కాదు. ఆడిట్ అనంతరం కంపెనీ చైర్మన్ ఓం ప్రకాశ్ భట్ రాజీనామా చేయడం దీనికి ప్రధాన కారణంగా మారింది.




