Form 39 Tax Relief: ITR 2026- ఫారం 39తో ట్యాక్స్ రిలీఫ్ ఎలా పొందాలి?
Form 39 Tax Relief: సాధారణంగా ఉద్యోగం మారినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు, కంపెనీ నుండి రావాల్సిన 'ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్' రావడానికి కొన్ని వారాలు లేదా నెలలు పడుతుంది.
Form 39 Tax Relief
Form 39 Tax Relief: సాధారణంగా ఉద్యోగం మారినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు, కంపెనీ నుండి రావాల్సిన 'ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్' రావడానికి కొన్ని వారాలు లేదా నెలలు పడుతుంది. ఒకవేళ ఈ డబ్బులు వచ్చేసరికి ఆర్థిక సంవత్సరం మారిపోతే, పన్ను చెల్లింపుదారులకు పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు అందడం వల్ల, ఆ వ్యక్తి ఆదాయం పెరిగి పన్ను స్లాబ్ మారిపోతుంది. ఫలితంగా భారీగా ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం 2025 కింద 'ఫామ్ 39' ను ప్రవేశపెట్టింది. ఈ ఫామ్ 39తో బకాయిల నుంచి రిలీఫ్ పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏమిటీ ఫామ్ 39?
గతంలో అమల్లో ఉన్న ఫామ్ 10ఇ స్థానంలో ఈ కొత్త ఫామ్ 39ని తీసుకువచ్చారు. ఇది ఆర్థిక సంవత్సరం 2026-27 నుండి అమలులోకి రానుంది. ఈ ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మీకు అందిన బకాయిలు ఏ సంవత్సరానికి చెందినవో, ఆయా సంవత్సరాల లెక్కల్లోనే చూపిస్తూ పన్ను ఉపశమనం పొందడం. అంటే, సెక్షన్ 157(1) ప్రకారం మీరు అదనపు పన్ను భారం పడకుండా కాపాడుకోవచ్చు.
ఫామ్ 39 వల్ల కలిగే ప్రయోజనాలు
ఫామ్ 39 వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫామ్ 39 సబ్మిట్ చేస్తే వ్యకత్ఇగత వివరాలు అన్నీ కూడా ఆటోమేటిక్‌గా వస్తాయి. కాబట్టి తప్పులు జరిగే అవకాశం తక్కువ. అరియర్స్, గ్రాట్యుటీ లేదా పెన్షన్ ఒకేసారి వచ్చినపుడు అవి ఏ సంవత్సరానికి సంబంధించినవో చెక్‌చేసి సర్దుబాటు చేయడం ద్వారా తక్కువ పన్ను కట్టే వీలుంటుంది. ఇన్‌కమ్‌ట్యాక్స్ పోర్టల్‌లో డ్రాప్‌డౌన్ మెనూలు, రియల్‌టైమ్ వెరిఫికేషన్ వంటి ఫీచర్ల వల్ల సామాన్యులు కూడా దీన్ని సులభంగా నింపవచ్చు.
పన్ను ఎలా ఆదా అవుతుంది?
ఈ ఫామ్ నింపే ముందు ఒక చిన్న లెక్క చూసుకోవాలి. బకాయిలు కలిపినప్పుడు వచ్చే పన్నుకు, బకాయిలు లేనప్పుడు వచ్చే పన్నుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలి. ఆ తర్వాత, సదరు బకాయిలను అవి ఏ ఏడాదికి చెందినవో ఆ ఏడాది ఆదాయంలో కలిపి చూస్తే పన్ను ఎంత వస్తుందో పోల్చుకోవాలి. ఈ పద్ధతి ద్వారా పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే ముందే ఈ ఫామ్ 39ని ఆన్‌లైన్ పోర్టల్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందగలరు. ఉద్యోగులు తమ కంపెనీకి కూడా ఈ వివరాలు ఇచ్చి టీడీఎస్ తగ్గించుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే... ఉద్యోగం మానేశాక వచ్చే బకాయిలపై అనవసరంగా ఎక్కువ పన్ను కట్టకుండా ఉండేందుకు 'ఫామ్ 39' ఒక వరప్రసాదం అనే చెప్పాలి. ఇది పాత ఫామ్ 10ఇ కంటే వేగంగా, పక్కాగా పనిచేస్తుంది.




