Mobile Recharge Price Hike: జియో, ఎయిర్‌టెల్, వీఐ రీఛార్జ్ ధరలు 15% పెరగొచ్చా?

జియో, ఎయిర్‌టెల్, వీఐ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 3-4 నెలల్లో 12-15 శాతం పెరగొచ్చని సెంట్రమ్ నివేదిక అంచనా వేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Aug 2026 4:40 AM IST
Jio, Airtel, Vi Recharge Prices
X

Jio, Airtel, Vi Recharge Prices 

మొబైల్ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు మరోసారి షాక్ తగలనుందా? ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. రాబోయే 3-4 నెలల్లో మొబైల్ టారిఫ్‌లు 12 నుంచి 15 శాతం వరకు పెరగవచ్చని సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ తన నివేదికలో అంచనా వేసింది.

అయితే టెలికాం కంపెనీలు ఇప్పటివరకు రీఛార్జ్ ధరల పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ప్రస్తుతం చెప్పిన ధరలు అంచనాలు మాత్రమేనని గమనించాలి.

టారిఫ్‌లు ఎందుకు పెరగొచ్చు?

దేశీయ టెలికాం రంగంలో పోటీ తగ్గి మార్కెట్ క్రమంగా స్థిరపడటం ధరల పెంపునకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉందని సెంట్రమ్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో మూడు ప్రధాన ప్రైవేట్ టెలికాం సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ కీలక సేవలను అందిస్తోంది.

2016లో జియో ప్రవేశంతో టెలికాం రంగంలో పోటీ తీవ్రంగా పెరిగింది. అయితే ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థల చేతుల్లోనే 80 శాతానికి పైగా మార్కెట్ వాటా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో టారిఫ్‌లను పెంచే సామర్థ్యం ఆయా కంపెనీలకు పెరిగినట్లు విశ్లేషించింది.

5జీ విస్తరణతో పెరిగిన పెట్టుబడుల భారం

దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు టెలికాం కంపెనీలు గత రెండేళ్లుగా భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులపై మెరుగైన రాబడిని సాధించాల్సిన ఒత్తిడి సంస్థలపై ఉంది. దీంతో సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం అంటే ఏఆర్‌పీయూను పెంచుకోవడం కంపెనీలకు కీలకంగా మారింది.

మరోవైపు వినియోగదారులు 2జీ నుంచి 4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు మారడం, పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల సంఖ్య పెరగడం వల్ల కూడా ఏఆర్‌పీయూ పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.

రూ.349 ప్లాన్ రూ.389కు చేరుతుందా?

ఒకవేళ టారిఫ్‌లను 12 శాతం పెంచితే ప్రస్తుతం రూ.349గా ఉన్న 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర సుమారు రూ.389కు చేరే అవకాశం ఉంది. అలాగే రూ.899గా ఉన్న 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర సుమారు రూ.1,007కు పెరగవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇక వార్షిక ప్లాన్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం రూ.3,599గా ఉన్న ఫ్రీ కాలింగ్, డేటా ప్లాన్ ధర 12 శాతం పెంపుతో సుమారు రూ.4,031కు చేరే అవకాశం ఉంది. ఒకవేళ టారిఫ్ పెంపు 15 శాతంగా ఉంటే ఈ ప్లాన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే ఇవన్నీ ప్రస్తుతానికి మార్కెట్ అంచనాలు మాత్రమే. జియో, ఎయిర్‌టెల్, వీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే రీఛార్జ్ ధరల్లో వాస్తవంగా ఎంత మార్పు ఉంటుందో స్పష్టమవుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story