Jio new plans: వైఫై, టీవీ, ఓటీటీ ఒకే ప్యాక్‌లో.. జియో కొత్త ప్లాన్లు
జియో హోమ్ కొత్త 3-ఇన్-1 ప్లాన్లను తీసుకొచ్చింది. వైఫై, 1,000కుపైగా టీవీ ఛానళ్లు, 12 ఓటీటీ సేవలు ఒకే ప్యాక్‌లో లభిస్తాయి.
Jio New Plans
Jio New Plans : వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా జియో హోమ్ కొత్త సర్వీస్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ వై-ఫై, లైవ్ టీవీ, ఓటీటీ సేవలను ఒకే ప్యాక్‌లో అందించే 3-ఇన్-1 ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. విడివిడిగా సేవలను తీసుకోవడంతో పోలిస్తే తక్కువ ఖర్చుతో వీటిని పొందవచ్చని సంస్థ తెలిపింది.
జియో కొత్తగా రెండు 3-ఇన్-1 ప్లాన్లను ప్రకటించింది. 2+1 నెలల ప్లాన్ ధర రూ.2,122గా ఉంది. నెలకు రూ.707 చొప్పున చెల్లించే ఈ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ వేగంతో పాటు 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లు, 12 ఓటీటీ వేదికలకు యాక్సెస్ లభిస్తుంది.
ఇక 3+1 నెలల ప్లాన్ ధర రూ.2,222. ఈ ప్లాన్‌లో నెలకు రూ.555 చొప్పున 30 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుతుంది. దీనితో పాటు 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లు, 12 ఓటీటీ వేదికలను వీక్షించే అవకాశం ఉంటుంది.
టీవీ-ఓన్లీ ప్లాన్లు కూడా..
జియో హోమ్ టీవీని మాత్రమే వినియోగించాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. ఐదు నెలల టీవీ-ఓన్లీ ప్లాన్ ధర రూ.2,000గా ఉంది. అంటే నెలకు రూ.400 చొప్పున ఖర్చవుతుంది. ఇందులో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లు, 200కుపైగా హెచ్‌డీ ఛానళ్లు, 15కుపైగా ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉంటుంది.
ఇదే టీవీ-ఓన్లీ ప్లాన్‌ను రెండు నెలల కాలపరిమితితో రూ.1,000కు పొందవచ్చు. ఈ ప్లాన్లకు అదనంగా రూ.200 సెటప్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వై-ఫై-ఓన్లీ ప్లాన్ల వివరాలివే..
బ్రాడ్‌బ్యాండ్ సేవలను మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం జియో వై-ఫై-ఓన్లీ ప్లాన్లను కూడా ప్రకటించింది. 100 ఎంబీపీఎస్ వేగంతో ఐదు నెలల ప్లాన్ ధర రూ.3,000గా ఉంది. అంటే నెలకు రూ.600 చొప్పున ఖర్చవుతుంది. రెండు నెలల ప్లాన్ ధర రూ.1,500గా ఉంది. దీనికి రూ.300 సెటప్ ఫీజు ఉంటుంది.
30 ఎంబీపీఎస్ వేగంతో ఐదు నెలల వై-ఫై ప్లాన్ ధర రూ.2,200గా ఉంది. నెలకు సుమారు రూ.450 చొప్పున ఖర్చవుతుంది. ఇదే వేగంతో రెండు నెలల ప్లాన్ రూ.1,100కు అందుబాటులో ఉంది.
ఇలా వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి వై-ఫై, టీవీ, ఓటీటీ సేవలను కలిపి పొందే 3-ఇన్-1 ప్లాన్‌ను లేదా ఒక్కో సేవకు ప్రత్యేకంగా ఉన్న ప్లాన్లను ఎంచుకోవచ్చు.




