Jio Platforms IPO: ఐపీఓల్లో 'జియో' సునామీ.. 100 నిమిషాల్లోనే రికార్డు..!

Jio Platforms IPO: రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 30,213 కోట్ల మెగా ఐపీఓ ప్రారంభమైన 100 నిమిషాల్లోనే 100% సబ్‌స్క్రైబ్ అయి సరికొత్త రికార్డు సృష్టించింది.

Gagan kumar
Published on: 22 Oct 2026 8:17 AM IST
Jio Platforms IPO
X

Jio Platforms IPO: ఐపీఓల్లో 'జియో' సునామీ.. 100 నిమిషాల్లోనే రికార్డు..!

Akash Ambani: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరే ఐపీఓ సాధించని సంచలనాన్ని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ నమోదు చేసింది. దాదాపు అర్ధ శతాబ్దం క్రితం దేశంలో ఈక్విటీ సంస్కృతికి పునాది వేసిన తాత ధీరూభాయ్ అంబానీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ప్రవేశపెట్టిన ఈ మెగా ఐపీఓ భారతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునరుద్ఘాటించింది.

భారత మార్కెట్ చరిత్రలోనే రూ. 30,213 కోట్ల అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్‌గా వచ్చిన జియో ప్లాట్‌ఫామ్స్ ఇష్యూ, ప్రారంభమైన కేవలం 100 నిమిషాల్లోనే 100 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.గతంలో హ్యుండాయ్ మోటార్స్ పేరిట ఉన్న రికార్డును ఇది తుడిచిపెట్టేసింది.

తొలిరోజే 10 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చిపడటంతో 1.14 రెట్లు నిండింది. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగానికి అనూహ్య స్పందన లభించి, ఏకంగా 3.68 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఒక్కో షేరుకు రూ. 1,065 నుండి రూ. 1,119గా నిర్ణయించారు. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉంటుంది.

ఐపీఓ ప్రారంభానికి ముందే మార్కెట్‌లో జియో హవా స్పష్టంగా కనిపించింది. కంపెనీ కేటాయించిన రూ. 8,110 కోట్ల యాంకర్ కోటా కోసం ఏకంగా రూ. 2.5 లక్షల కోట్లకు పైగా బిడ్లు దాఖలవడం మైండ్ బ్లాకింగ్ అని చెప్పవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒక్కటే రూ. 500 కోట్లు కేటాయించగా.. న్యూ వరల్డ్ ఫండ్స్‌తో పాటు 25 ప్రముఖ దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థల ఆధ్వర్యంలో 212 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 8,109.85 కోట్లను కంపెనీ విజయవంతంగా సేకరించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత వాటాదారుల కోసం కంపెనీ ఒక తీపి కబురు అందించింది. ప్రత్యేకంగా రూ. 2,500 కోట్ల విలువైన షేర్లను వారి కోసం కేటాయించింది. దీనివల్ల అర్హులైన ఇన్వెస్టర్లు షేర్‌హోల్డర్ కేటగిరీతో పాటు, రిటైల్ కేటగిరీలోనూ దరఖాస్తు చేసుకుని షేర్ల కేటాయింపు అవకాశాలను రెట్టింపు చేసుకునే వెసులుబాటు లభించింది.

ఐపీఓ ప్రచారంలో భాగంగా ముంబయిలో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ ,కోటక్ మహీంద్రా దిగ్గజం ఉదయ్ కోటక్‌లతో కలిసి పాల్గొని గుజరాత్ ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నారు. ధీరూభాయ్ అంబానీ 'రిలయన్స్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్' పేరిట రూ. 10 ధరతో కేవలం రూ. 2.8 కోట్ల ఐపీఓ తెచ్చి, బ్యాంకులపై ఆధారపడకుండా 58,000 మంది సాధారణ పౌరులను వ్యాపార భాగస్వాములను చేశారు.

దాని ఫలితంగా 1980-1985 మధ్య దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఆ రోజుల్లో ప్రతీ నలుగురు భారతీయ ఇన్వెస్టర్లలో ఒకరి వద్ద రిలయన్స్ షేర్ ఉండేది.1990 నుంచి ఇప్పటివరకు రిలయన్స్ షేరు విలువ ఏకంగా 330 రెట్లు పెరిగి సాధారణ ఇన్వెస్టర్లకు అపారమైన సంపదను సృష్టించి పెట్టింది.

ఆనాటి తాత ధీరూభాయ్ సెంటిమెంట్‌ను, గుజరాత్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఆకాశ్ అంబానీ సామాన్య పెట్టుబడిదారులతో బంధాన్ని మరింత బలపరిచారు. భారత ఈక్విటీ మార్కెట్లో నూతన శకాన్ని ఆరంభించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్ల సంపదను ఏ స్థాయిలో పెంచుతుందో అని దలాల్ స్ట్రీట్ ఆసక్తిగా గమనిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.