Jio: అదరగొట్టిన జియో.. 3 నెలల్లో రూ.8,389 కోట్ల లాభం!

Jio: జియో ప్లాట్‌ఫార్మ్స్ క్యూ2 ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 8,389 కోట్లకు చేరగా, కార్యాచరణ ఆదాయం రూ. 40,475 కోట్లుగా నమోదైంది. 5G సబ్‌స్క్రైబర్లు 30 కోట్లకు చేరుకున్నారు.

Gagan kumar
Published on: 31 Oct 2026 10:25 AM IST
Jio
X

Jio: అదరగొట్టిన జియో.. 3 నెలల్లో రూ.8,389 కోట్ల లాభం!

Jio Q2 Results: భారత డిజిటల్, టెలికాం ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని జియో ప్లాట్‌ఫార్మ్స్ మరోసారి చాటుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మైండ్ బ్లాకింగ్ ఫలితాలతో ఇన్వెస్టర్లు, విశ్లేషకులను విస్మయపరిచింది. ఆర్థిక సంవత్సరంలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ, నికర లాభాల్లోనూ, ఆదాయంలోనూ జియో దూకుడు ప్రదర్శించింది.

గత మూడు నెలల కాలంలో ఏకంగా రూ. 8,389 కోట్ల నికర లాభాన్ని గడించి జియో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 14 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేయడమే కాకుండా, క్రితం త్రైమాసికం కంటే 8 శాతం అధికంగా లాభాలను ఆర్జించింది. ఇక కంపెనీ కార్యాచరణ ఆదాయం 11 శాతం పెరిగి రూ. 40,475 కోట్లకు చేరడం టెలికాం రంగంలో జియోకున్న తిరుగులేని పట్టుకు నిదర్శనంగా నిలిచింది. ఇటీవల చేపట్టిన రీచార్జ్ టారిఫ్ సవరణలు, ప్రతి వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.

అక్టోబర్ చివర్లో దేశీయ స్టాక్ మార్కెట్లలో విజయవంతంగా అడుగుపెట్టిన జియోకు, ఇవి పబ్లిక్ ఇష్యూ తర్వాత వచ్చిన తొలి త్రైమాసిక ఫలితాలు కావడం విశేషం. ఐపీఓ ఇష్యూ ధర కంటే ఏకంగా 21 శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి ఇన్వెస్టర్లకు శుభారంభాన్ని అందించిన జియో, ఇప్పుడు ప్రకటించిన అద్భుతమైన ఆర్థిక ఫలితాలతో వారి నమ్మకాన్ని మరింత బలోపేతం చేసింది.

ఈ ఆర్థిక విజయాల వెనుక జియో సాంకేతిక విస్తరణ ఎంతగానో దోహదపడింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి జియో 5జీ చందాదారుల సంఖ్య ఏకంగా 30 కోట్లకు చేరుకుంది. కంపెనీకి చెందిన మొత్తం వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో ఒక్క 5జీ వాటానే 56 శాతంగా నమోదవ్వడం విశేషం. మరోవైపు, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ జియో ఎయిర్ ఫైబర్ సంచలనం సృష్టిస్తోంది.

కొత్తగా చేరిన చందాదారులలో అత్యధిక భాగం ఎయిర్ ఫైబర్ నుంచే రావడం, డిజిటల్ కనెక్టివిటీకి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంతటి ఆదరణ ఉందో స్పష్టం చేస్తోంది. అటు ఆర్ధికంగా, ఇటు సాంకేతికంగా సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూ జియో డిజిటల్ విప్లవంలో తన సత్తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.