రూ.లక్ష పెట్టుబడితో రూ.2 లక్షలు.. డబ్బును రెట్టింపు చేసే ప్రభుత్వ పథకం!
Kisan Vikas Patra: తమ పొదుపు మొత్తాన్ని సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు మంచి రాబడి పొందాలని చాలామంది కోరుకుంటారు.
రూ.లక్ష పెట్టుబడితో రూ.2 లక్షలు.. డబ్బును రెట్టింపు చేసే ప్రభుత్వ పథకం!
Kisan Vikas Patra: తమ పొదుపు మొత్తాన్ని సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు మంచి రాబడి పొందాలని చాలామంది కోరుకుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే రిస్క్‌ను ఇష్టపడరు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం బెస్ట్ ఆప్షన్. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కిసాన్ వికాస్ పత్ర పథకం అంటే ఏంటి?
కిసాన్ వికాస్ పత్ర అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బుకు ప్రభుత్వ భద్రత ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా నిర్ణీత వడ్డీ రేటు ప్రకారం రాబడి లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు తమ డబ్బును భద్రంగా ఉంచుకోవాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది.
ఇందులో కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి ప్రారంభమవుతుంది. రూ.100 చొప్పున అదనంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు. అంటే ఆర్థిక స్థోమతను బట్టి ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది?
2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న త్రైమాసికానికి కిసాన్ వికాస్ పత్రపై వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఈ వడ్డీ ఏటా చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం పెట్టుబడి మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. అంటే సుమారు 9 సంవత్సరాల 7 నెలల సమయం పడుతుంది.
ఉదాహరణకు ఈ పథకంలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ.2 లక్షలు పొందవచ్చు. అదే రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే రూ.20 లక్షలు, రూ.1 కోటి పెట్టుబడి పెడితే సుమారు రూ.2 కోట్లు అందుతాయి.
రూ.కోటి పెట్టుబడి పెట్టవచ్చా?
కిసాన్ వికాస్ పత్ర పథకంలో గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి పెట్టుబడిదారులు తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి పెద్ద మొత్తంలో కూడా డబ్బు జమ చేయవచ్చు. ఉదాహరణకు రూ.కోటి పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.2 కోట్లు పొందవచ్చు.
అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు ఆదాయపు పన్ను నిబంధనలు, పెట్టుబడి మూలం, మెచ్యూరిటీ గడువు, ముందస్తు ఉపసంహరణ నిబంధనలను పరిశీలించాలి. ఈ పథకంలో వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను వర్తిస్తుంది. అలాగే పెట్టుబడికి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు లభించదు.
ఈ పథకంలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
దీర్ఘకాలిక పొదుపు కోరుకునే వారికి, తమ పెట్టుబడిపై మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి కిసాన్ వికాస్ పత్ర ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసినవారు, సీనియర్ సిటిజన్లు స్థిరమైన రాబడి కోసం ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
అయితే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బును ఎప్పుడు పడితే అప్పుడు వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. సాధారణంగా రెండున్నరేళ్ల తర్వాత మాత్రమే నిర్దిష్ట నిబంధనల ప్రకారం ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసర అవసరాల కోసం ఉపయోగించాల్సిన డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టకూడదు. పెట్టుబడి పెట్టే ముందు సమీపంలోని పోస్టాఫీసులో వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ గడువు, ఇతర నిబంధనలను తెలుసుకోవడం మంచిది.




