Meta: 'మెటా'కు బిగ్ షాక్ ..రూ. 1,40,000 కోట్లు భారీ సెటిల్‌మెంట్‌!

Meta: చిన్నారుల డేటా దుర్వినియోగం, సోషల్ మీడియా అడిక్షన్ ఆరోపణలపై 29 అమెరికా రాష్ట్రాలతో మెటా 16.68 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.

Gagan kumar
Published on: 27 Aug 2026 9:11 AM IST
Meta
X

Meta: 'మెటా'కు బిగ్ షాక్ ..రూ. 1,40,000 కోట్లు భారీ సెటిల్‌మెంట్‌!

Meta: డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం 'మెటా' తీవ్ర ఒత్తిడికి తలొగ్గింది. పిల్లల భద్రతను విస్మరించారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, అమెరికాలోని 29 రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకు ఏకంగా రూ. 1,40,000 కోట్లు భారీ సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. కాలిఫోర్నియా ఫెడరల్ విచారణలో కుదిరిన ఈ ఒప్పందం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉద్దేశపూర్వకంగానే చిన్నారులను బానిసలుగా మార్చేలా డిజైన్ చేశారని అగ్రరాజ్య రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. మైనర్ల నుంచి అనుమతి లేకుండా వ్యక్తిగత డేటాను సేకరించి, తమ మెషీన్ లెర్నింగ్ మరియు జనరేటివ్ AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకున్నారని ప్రధానంగా ఆరోపించాయి. భద్రతా ప్రమాణాల విషయంలో వినియోగదారులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తాయి.

ఈ చారిత్రాత్మక ఒప్పందంతో అమెరికాలోని టీనేజ్ యూజర్ల రక్షణకు మెటా కొన్ని కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. రోజువారీ సోషల్ మీడియా వినియోగంపై నిర్దిష్ట పరిమితులు విధిస్తారు. రాత్రి వేళల్లో టీనేజర్లు ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయకుండా సాంకేతిక నిరోధాలు ఏర్పాటు చేస్తారు.

ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకున్నప్పటికీ, తాము ఎలాంటి చట్టపరమైన తప్పు చేయలేదని మెటా స్పష్టం చేసింది. విశేషమేమిటంటే, సుదీర్ఘ అస్పష్టత తొలగిపోవడంతో ఈ వార్త వెలువడిన వెంటనే ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో మెటా షేర్లు 4.4 శాతం పెరిగాయి.

మెటా ఈ భారీ సెటిల్‌మెంట్‌తో తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ, స్నాప్‌చాట్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి ఇతర టెక్ సంస్థలపై కూడా ఇలాంటి విచారణలు కొనసాగుతుండటంతో సోషల్ మీడియా వేదికల భావి భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story