Laptop price hike: ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి షాక్.. భారీగా పెరుగుతున్న ధరలు!
Laptop Prices hike: భారత్‌లో ల్యాప్‌టాప్, కంప్యూటర్ ధరలు 35 శాతం వరకు పెరగనున్నాయి. చిప్ కొరత, AI డిమాండ్ పెరగడమే దీనికి ప్రధాన కారణం.. పూర్తి వివరాలు..
Laptop Prices hike
Laptop price hike: ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక బ్యాడ్ న్యూస్. మన దేశంలో కంప్యూటర్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత ఖరీదుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ధరలు భారీగా పెరిగాయి. ముందుముందు వీటి ధరలు 35 శాతం వరకూ పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ధరల పెరుగుదల ఎందుకు?
మెమరీ (DRAM - NAND) ధరలు పెరగడానికి అతిపెద్ద కారణంగా చెబుతున్నారు. అలాగే 'AI మౌలిక సదుపాయాల'కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. కంపెనీలు ఇప్పుడు తమ ప్రోడక్ట్స్ ను అధిక-మార్జిన్ సర్వర్లు, అధిక-బ్యాండ్‌విడ్త్ మెమరీ వైపు మారుస్తున్నాయి. దీని వలన సాధారణ ల్యాప్‌టాప్‌ల విడిభాగాలు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇంటెల్ ఎంట్రీ-లెవల్ ప్రాసెసర్ల కొరత కూడా ఈ సంక్షోభానికి దారితీసింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం
ఇంధనం -పెట్రోకెమికల్స్‌కు కీలకమైన మార్గమైన హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ఆయిల్, గ్యాస్ ధరలపై ప్రభావం పడింది. అది భవిష్యత్తులో కంప్యూటర్ రంగంలో ధరల సంక్షోభం కూడ మరింత ఎక్కువ చేసే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. ఈ అంతరాయాలు ఇలానే కొనసాగితే, సెమీకండక్టర్ తయారీకి ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతాయి, ఇది చిప్‌ల లభ్యత, ధరలపై ప్రభావం చూపుతుంది.
ఎంత వరకూ పెరగవచ్చు?
మార్చిలో ఇప్పటికే 10-12 శాతం ధరలు పెరిగాయి. ఈ నెలలో ఇంకో 10 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ₹30,000 నుండి ₹35,000 ధర ఉన్న పరికరాల ధర ఇప్పుడు ₹45,000కి దగ్గరగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ 35,000 రూపాయల ధర ఉన్న ల్యాప్‌టాప్ ఇకపై 45,000 రూపాయలకు చేరుకుంటుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెరుగుదల వలన విద్యార్థులు, గృహ వినియోగదారులు, మొదటిసారి కంప్యూటర్ కొనుగోలు చేసేవారు అప్‌గ్రేడ్ చేసుకోవడం కష్టమవుతుంది.
రికార్డ్ స్థాయి నుంచి పడిపోతున్న మార్కెట్..
భారతీయ PC మార్కెట్‌కు 2025 సంవత్సరం ఒక మైలురాయి సంవత్సరం. IDC డేటా ప్రకారం, గత సంవత్సరం షిప్‌మెంట్‌లు 15.9 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. ఇది సంవత్సరంతో పోలిస్తే 10.2% వృద్ధి. వార్షిక షిప్‌మెంట్‌లు 15 మిలియన్లను దాటడం అదే మొదటిసారి.
అయితే, ఈ సంవత్సరం అధిక ధరల కారణంగా డిమాండ్ తగ్గిపోతుందని భావిస్తున్నారు. వినియోగదారుల డిమాండ్.. వాణిజ్య విభాగాల డిమాండ్ రెండూ 7-8% తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.




