పిల్లల భవిష్యత్తు కోసం రూ.40 లక్షలు కావాలా? LICలోని ఈ 3 స్కీమ్‌లతో భారీ ఫండ్ సృష్టించుకోవచ్చు
LIC Child Plans: పిల్లల చదువు, ఉన్నత విద్య, భవిష్యత్తు అవసరాల కోసం ముందుగానే డబ్బు పొదుపు చేయాలని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు.
పిల్లల భవిష్యత్తు కోసం రూ.40 లక్షలు కావాలా? LICలోని ఈ 3 స్కీమ్‌లతో భారీ ఫండ్ సృష్టించుకోవచ్చు
LIC Child Plans: పిల్లల చదువు, ఉన్నత విద్య, భవిష్యత్తు అవసరాల కోసం ముందుగానే డబ్బు పొదుపు చేయాలని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకునే తల్లిదండ్రులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పలు పథకాలను అందిస్తోంది. వీటిలో 3 పథకాల గురించి తెలుసుకుందాం.
LIC అమృత్‌బాల్.. ప్రతి ఏడాది గ్యారెంటీడ్ అదనపు మొత్తం
పెట్టుబడితో పాటు ముందుగానే నిర్ణయించిన అదనపు మొత్తాన్ని పొందాలనుకునే వారికి LIC అమృత్‌బాల్ ప్లాన్ ఒక ఎంపిక. ఈ పథకంలో ప్రతి రూ.1,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌పై పాలసీ కొనసాగిన ప్రతి పూర్తి సంవత్సరానికి రూ.80 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. అంటే పాలసీ ఎంతకాలం కొనసాగితే అన్ని సంవత్సరాలకు సంబంధించిన అదనపు మొత్తం జతవుతుంది. ఈ పథకాన్ని 30 రోజుల నుంచి 13 ఏళ్ల వయసున్న పిల్లల కోసం తీసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో పిల్లల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండేలా పాలసీని ఎంచుకోవచ్చు. ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించే అవకాశం ఉంది. లేదంటే నిర్ణీత కాలపరిమితిలో వాయిదాల రూపంలోనూ చెల్లించవచ్చు.
పాలసీ మెచ్యూరిటీ సమయంలో బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో పాటు అప్పటివరకు జమ అయిన గ్యారెంటీడ్ అడిషన్లు కలిపి చెల్లిస్తారు. ఈ పథకంలో కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. పిల్లల భవిష్యత్తు కోసం ముందుగానే ఒక నిర్దిష్ట మొత్తాన్ని సమకూర్చుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
LIC జీవన్ తరుణ్.. చదువుల సమయంలోనే డబ్బులు పొందే అవకాశం
పిల్లలు కాలేజీకి వెళ్లే సమయంలో ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఇలాంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని LIC జీవన్ తరుణ్ పథకాన్ని రూపొందించింది. ఇందులో పిల్లల వయసును బట్టి వేర్వేరు దశల్లో డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.
ఈ పథకంలో తల్లిదండ్రులు నాలుగు రకాల చెల్లింపు విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
మొదటి ఆప్షన్: 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఎలాంటి చెల్లింపులు ఉండవు. 25 ఏళ్ల వయసులో మొత్తం బేసిక్ సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు.
రెండో ఆప్షన్: 20 నుంచి 24 ఏళ్ల మధ్య ప్రతి ఏడాది బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 5 శాతం చొప్పున చెల్లిస్తారు.
మూడో ఆప్షన్: ఇదే కాలంలో ప్రతి ఏడాది 10 శాతం చొప్పున చెల్లిస్తారు.
నాలుగో ఆప్షన్: ప్రతి ఏడాది 15 శాతం చొప్పున చెల్లిస్తారు.
ఈ నాలుగు ఆప్షన్లలో ఎంచుకున్న విధానాన్ని బట్టి 25 ఏళ్ల వయసులో మిగిలిన మొత్తాన్ని మెచ్యూరిటీ ప్రయోజనంగా చెల్లిస్తారు. పాలసీ నిబంధనల ప్రకారం బోనస్ కూడా లభించవచ్చు.
నెలకు రూ.5,000 చెల్లిస్తే ఎంత మొత్తం వస్తుంది?
ఉదాహరణకు పిల్లలు పుట్టిన వెంటనే ఈ పాలసీ తీసుకుని నెలకు సుమారు రూ.5,000 ప్రీమియం చెల్లిస్తున్నారని అనుకుందాం. అంటే ఏడాదికి రూ.60,000 చొప్పున 18 ఏళ్ల పాటు మొత్తం రూ.10.80 లక్షలు చెల్లించినట్లు అవుతుంది. దీని ప్రకారం పిల్లలకు 20 నుంచి 24 ఏళ్ల వయసులో కాలేజీ అవసరాల కోసం సుమారు రూ.9 లక్షలు అందవచ్చు. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులో దాదాపు రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు మెచ్యూరిటీ మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవంగా ఎంత మొత్తం వస్తుందనేది ఎంచుకున్న ఆప్షన్, బోనస్, పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
LIC న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్.. మూడు దశల్లో డబ్బుల చెల్లింపు
పిల్లలకు ఒకేసారి కాకుండా చదువులోని వివిధ దశల్లో ఆర్థిక సహాయం అందించాలని భావించే తల్లిదండ్రులకు LIC న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ మరో ఎంపిక. ఇందులో పిల్లల వయసును బట్టి నిర్ణీత మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తారు. ఈ పథకం ప్రకారం పిల్లలకు 18 ఏళ్లు వచ్చినప్పుడు బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 20 శాతం చెల్లిస్తారు. ఆ తర్వాత 20 ఏళ్లు, 22 ఏళ్ల వయసులో మరో 20 శాతం చొప్పున అందిస్తారు. ఇలా మూడు విడతల్లో కలిపి 60 శాతం మొత్తం చెల్లిస్తారు.
మిగిలిన 40 శాతం మొత్తాన్ని పిల్లలకు 25 ఏళ్లు వచ్చినప్పుడు చెల్లిస్తారు. దీనికి అదనంగా పాలసీకి జమ అయిన బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా పాలసీ నిబంధనల ప్రకారం లభించవచ్చు. ఈ పథకాన్ని 0 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లల కోసం తీసుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత 18, 20, 22 ఏళ్ల వయసులో వచ్చే డబ్బును ఉన్నత విద్య, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. 25 ఏళ్ల వయసులో వచ్చే మిగిలిన మొత్తాన్ని కెరీర్ లేదా ఇతర భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.
LICలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఫండ్ సమకూర్చుకోవాలనుకుంటే ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. పిల్లల వయసు, భవిష్యత్తులో డబ్బు అవసరమయ్యే సమయం, ప్రతి నెలా చెల్లించగల ప్రీమియం ఆధారంగా సరైన పథకాన్ని ఎంచుకోవాలి.
అలాగే మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం పూర్తిగా గ్యారెంటీడ్‌నా? లేక బోనస్‌పై ఆధారపడి ఉంటుందా? అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని LIC పథకాల్లో ప్రీమియం వేయివర్ బెనిఫిట్ రైడర్ తీసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ తీసుకున్న తల్లిదండ్రులు మరణిస్తే, నిబంధనలకు అనుగుణంగా మిగిలిన ప్రీమియాన్ని బీమా సంస్థ చెల్లించే ప్రయోజనం ఇందులో ఉంటుంది. ఇందుకోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. అర్హత, అమల్లో ఉన్న పన్ను నిబంధనల ఆధారంగా సెక్షన్ 80C, సెక్షన్ 10(10D) కింద పన్ను ప్రయోజనాలు కూడా లభించవచ్చు.




