LICలో వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం.. పాలసీదారులపై ఎలాంటి ప్రభావం పడనుంది.
LIC: దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధమైంది.
LICలో వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం.. పాలసీదారులపై ఎలాంటి ప్రభావం పడనుంది.
LIC: దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధమైంది. మొత్తం 6.5 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశం ఉంది. మరి దీంతో పాలసీదారులపై, పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం.
ప్రభుత్వం LICలో వాటా ఎందుకు విక్రయిస్తోంది?
భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నిబంధనల ప్రకారం, స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్‌గా ఉన్న ప్రతి కంపెనీలో కనీసం 25 శాతం వాటా ప్రజల చేతుల్లో ఉండాలి. ప్రస్తుతం LICలో ప్రజల వాటా కేవలం 3.5 శాతం మాత్రమే ఉంది. ఈ వాటాను 25 శాతానికి పెంచాలని SEBI సూచించింది. ఇందుకోసం 2027 మే వరకు గడువు కూడా ఇచ్చింది.
ఈ నిబంధనను అమలు చేయడానికే కేంద్ర ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తోంది. తొలుత 2 శాతం షేర్లు విక్రయించనున్నారు. పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తే మరో 4.5 శాతం షేర్లు కూడా అమ్మే అవకాశం ఉంది. మొత్తం విక్రయం పూర్తైతే ప్రభుత్వానికి సుమారు రూ.31,410 కోట్లు లభించే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్లకు ఎలాంటి ప్రయోజనం?
LIC షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కావచ్చు. మార్కెట్ ముగిసే సమయానికి LIC ఒక్కో షేరు ధర రూ.428.50గా ఉండగా, OFS కోసం ప్రభుత్వం ఫ్లోర్ ప్రైస్‌ను రూ.382గా నిర్ణయించింది. అంటే మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు 11 శాతం తక్కువ ధరకే షేర్లు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. అంతేకాకుండా, రిటైల్ ఇన్వెస్టర్లు, LIC ఉద్యోగులకు మరో అదనపు ప్రయోజనం కూడా కల్పించారు. వారికి తుది షేరు ధరపై రూ.15 అదనపు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
LIC పాలసీదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా.?
LICలో ప్రభుత్వం వాటా విక్రయిస్తున్నప్పటికీ పాలసీదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఈ షేర్ విక్రయం వల్ల మీ LIC పాలసీ, బోనస్, మెచ్యూరిటీ మొత్తం లేదా ఇతర ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ పాలసీ నిబంధనలు యథాతథంగానే కొనసాగుతాయి. అలాగే మీ పాలసీకి ఉన్న ప్రభుత్వ హామీ కూడా కొనసాగుతుంది. అంటే ఈ ప్రక్రియ పూర్తిగా స్టాక్ మార్కెట్ నిబంధనలను పాటించడానికి మాత్రమే చేపడుతున్నారు. దీనికి పాలసీల భద్రతతో లేదా బీమా ప్రయోజనాలతో ఎలాంటి సంబంధం లేదు.




