LIC: ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్‌ఐసీదే హవా.. రూ.12,207 కోట్ల డివిడెండ్‌తో అగ్రస్థానం
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసీ రూ.12,207 కోట్ల డివిడెండ్ అందించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇదే అత్యధిక చెల్లింపు.
LIC Dividend
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ.12,207 కోట్ల డివిడెండ్ చెల్లించి ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూలు) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు బుధవారం ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆర్. దొరైస్వామి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు డివిడెండ్ చెక్కును అందజేశారు.
అదే సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,853 కోట్ల డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రికి అందించింది. బ్యాంక్ ఎండీ, సీఈఓ ఆశీష్ పాండే ఈ చెక్కును అందజేశారు.
ఇక ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కూడా రూ.211 కోట్ల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. సంస్థ ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ గిరిజా సుబ్రమణియన్ ఈ చెక్కును ఆర్థిక మంత్రికి అందించారు.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన పురోగతి సాధించాయని తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి రికార్డు స్థాయిలో 1.9 శాతానికి తగ్గగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల సంయుక్త నికర లాభం రూ.1.98 లక్షల కోట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు.




