లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా.? బెస్ట్ పాలసీని ఎలా సెలక్ట్ చేసుకోవాలంటే!
Life insurance: కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో జీవిత బీమా కీలక పాత్ర పోషిస్తుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా.? బెస్ట్ పాలసీని ఎలా సెలక్ట్ చేసుకోవాలంటే!
Life insurance: కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో జీవిత బీమా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పాలసీ తీసుకునే ముందు కేవలం ప్రీమియం ఎంతనేది కాకుండా.. బీమా మొత్తం, పాలసీ కాలవ్యవధి, కంపెనీ విశ్వసనీయత వంటి అంశాలను పరిశీలించాలి. సరైన పాలసీని ఎంచుకోవడానికి ఈ విషయాలపై దృష్టి పెట్టండి.
కుటుంబ అవసరాలకు తగ్గ కవర్:
మీ తర్వాత కుటుంబానికి ఎంత మొత్తం అవసరమవుతుందో ముందుగా లెక్కించాలి. నెలవారీ ఖర్చులు, అప్పులు, పిల్లల చదువులు, వివాహాలు, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను ఇందులో పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయం, బాధ్యతలు పెరిగే కొద్దీ కవర్‌ను పెంచుకునే అవకాశం ఉన్న పాలసీలను పరిశీలించవచ్చు. కేవలం కుటుంబ రక్షణే లక్ష్యమైతే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఎంపికగా ఉంటుంది.
బీమా సంస్థ ఆర్థిక బలం:
పాలసీ దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి బీమా సంస్థ ఆర్థిక స్థితి కూడా ముఖ్యమే. కంపెనీ ఆర్థిక నివేదికలు, గత పనితీరు, మార్కెట్‌లో దాని స్థిరత్వాన్ని పరిశీలించాలి. నిపుణుల విశ్లేషణలు, అధికారిక నివేదికలను పరిశీలించడం ద్వారా సంస్థ ఆర్థికంగా ఎంత బలంగా ఉందో అంచనా వేయవచ్చు.
కంపెనీ చరిత్ర, సేవల పరిధి:
బీమా సంస్థ ఎప్పటి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది, కస్టమర్లలో దాని విశ్వసనీయత ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. కొత్త కంపెనీ అయితే దాని నేపథ్యం, నిర్వహణ, సేవల వివరాలను పరిశీలించడం మంచిది. అలాగే మీ ప్రాంతంలో శాఖలు లేదా భౌతిక కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయా అనేది చూడాలి. అవసరమైన సమయంలో నేరుగా సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను చూడాలి:
పాలసీ తీసుకునే ముందు సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో (CSR)ను తప్పక పరిశీలించాలి. అంటే అందిన క్లెయిమ్‌లలో ఎంత శాతం పరిష్కరించిందో తెలియజేసే సూచిక. అయితే CSR ఒక్కటినే ఆధారంగా చేసుకోకుండా క్లెయిమ్ తిరస్కరణ వివరాలు, పరిష్కార సమయం, కస్టమర్ సేవలు కూడా చూడాలి. తాజా గణాంకాల కోసం IRDAI అధికారిక నివేదికలను పరిశీలించడం మంచిది.




