Credit Card: క్రెడిట్ కార్డ్ పోయి వేరేవాళ్లు వాడేస్తే ఆ బిల్లు ఎవరు చెల్లించాలి?
Credit Card: దురదృష్టవశాత్తూ మీ క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఆ తర్వాత ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాని ద్వారా వేల రూపాయల లావాదేవీలు జరిపారా?
Credit Card
Credit Card: దురదృష్టవశాత్తూ మీ క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఆ తర్వాత ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాని ద్వారా వేల రూపాయల లావాదేవీలు జరిపారా? అలాంటప్పుడు ఆ బిల్లు ఎవరు కట్టాలి? అసలు ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెప్తున్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జేబులో ఉండాల్సిన క్రెడిట్ కార్డ్ కనిపించకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. కార్డ్ ఎక్కడైనా పడిపోయిందని చిన్న అనుమానం వచ్చినా వెంటనే మొబైల్ యాప్, నెట్ బ్యాంకింగ్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా దాన్ని ఫ్రీజ్ చేయడం లేదా పూర్తిగా బ్లాక్ చేయడం ఉత్తమమైన మార్గం. కార్డ్ బ్లాక్ చేసిన క్షణం నుంచి జరిగే ఎలాంటి అక్రమ లావాదేవీలకు కార్డుదారుడు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాతి లావాదేవీల పూర్తి బాధ్యత సదరు బ్యాంకుదే అవుతుంది. అయితే బ్లాక్ చేయడానికి ముందే ఎవరైనా వాడేస్తే ఏం చేయాలనేదే అతిపెద్ద ప్రశ్న.
మూడు పనిదినాల్లో ఫిర్యాదు చేస్తే రూపాయి కట్టక్కర్లేదు
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం లేదా లోపాల వల్ల అక్రమ లావాదేవీలు జరిగితే వినియోగదారుడిపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. మూడో వ్యక్తి ప్రమేయంతో పేమెంట్ సిస్టమ్ లో లోపాల వల్ల మోసం జరిగినా కూడా కస్టమర్‌కు పూర్తి రక్షణ ఉంటుంది. దీనికోసం బ్యాంకు నుంచి లావాదేవీ మెసేజ్ వచ్చిన క్షణం నుంచి 3 వర్కింగ్ డేస్ లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే కార్డ్ పోయిన రోజు నుంచి కాకుండా, మీ ఫోన్‌కు అనధికారిక లావాదేవీ మెసేజ్ వచ్చిన సమయం నుంచి ఈ 3 రోజుల గడువు లెక్కిస్తారు. ఈ సమయంలోపు సమాచారం ఇస్తే మీ ఖాతా బాధ్యతను సున్నాగా పరిగణిస్తారు.
ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే పరిమితులకు లోబడి భారం
అనధికారిక లావాదేవీ జరిగినట్లు తెలుసుకుని కూడా 3 రోజుల పరిమితి దాటితే సమస్యలు మొదలవుతాయి. 4 నుంచి 7 పనిదినాల వ్యవధిలో ఫిర్యాదు చేస్తే ఆర్‌బీఐ బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం కొంతమొత్తం నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది. ఒకవేళ 7 రోజులు దాటిన తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంకు నిబంధనల ఆధారంగా మీపై పూర్తి నష్టభారం పడే ప్రమాదం ఉంది. అందుకే బ్యాంకు నుంచి అనధికారిక లావాదేవీ మెసేజ్ రాగానే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు.
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930ను ఉపయోగించండి
కార్డ్ పోయిన వెంటనే అధికారిక యాప్ ద్వారా కస్టమర్ కేర్ ను సంప్రదించి కార్డ్ బ్లాక్ చేయాలి. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత లభించే కంప్లైంట్ నంబర్, తేదీ, సమయం వివరాలను జాగ్రత్తగా రాసి ఉంచుకోవాలి. ఒకవేళ కార్డ్ దొంగతనానికి గురైతే సమీప పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం మంచిది. ఆర్థిక మోసం జరిగినట్లు గ్రహిస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. జాతీయ సైబర్ నేరాల పోర్టల్‌లో కూడా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు ఇచ్చే వెసులుబాటు ఉంది.




