LPG Crisis in Bangalore: బెంగళూరులో హోటళ్లు క్లోజ్..తిండి కోసం విలవిలలాడుతున్న జనం

LPG Crisis in Bangalore: బెంగళూరులో కమర్షియల్ ఎల్‌పిజి (LPG) సరఫరా నిలిచిపోవడంతో హోటల్ పరిశ్రమ కుప్పకూలే స్థితికి చేరుకుంది. సిలిండర్ల కొరతపై సిఎం సిద్ధరామయ్య కేంద్రానికి లేఖ.

Naresh.k
Published on: 11 March 2026 9:27 AM IST
LPG Crisis in Bangalore
X

LPG Crisis in Bangalore: బెంగళూరులో హోటళ్లు క్లోజ్..తిండి కోసం విలవిలలాడుతున్న జనం

LPG Crisis in Bangalore: సిలికాన్ సిటీ బెంగళూరులో గ్యాస్ మంటలు రేగుతున్నాయి. అయితే ఇవి ధరల మంటలు కావు.. సరఫరా లేక ఆరిపోతున్న వంటశాలల మంటలు. గత కొన్ని రోజులుగా బెంగళూరు నగరంలో వాణిజ్య ఎల్‌పిజి (Commercial LPG) సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో హోటల్ పరిశ్రమ కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే, ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రంగంలోకి దిగి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏమైంది? ఎందుకీ కొరత?

మార్చి 9 నుండి నగరంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం మొదలైంది. సాధారణంగా బెంగళూరు వాణిజ్య అవసరాలకు IOCL, HPCL, BPCL వంటి చమురు కంపెనీలు రోజుకు సుమారు 1,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను సరఫరా చేయాలి. కానీ అకస్మాత్తుగా ఈ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్ళు, మెస్సులు, కేటరింగ్ సెంటర్లు అతలాకుతలం అవుతున్నాయి. వేచి ఉండే సమయం ఏకంగా 25 రోజులకు పెరిగిపోవడంతో పంపిణీదారులు చేతులెత్తేస్తున్నారు.

దోసెలకు గ్యాస్ గండం

నగరంలోని ప్రముఖ హోటళ్లలో ఒకటైన 'విద్యార్థి భవన్' పరిస్థితి ఈ సంక్షోభానికి అద్దం పడుతోంది. రోజుకు సుమారు 2,000 దోసెలు వేసే ఈ హోటల్‌లో ఇప్పుడు పొయ్యిలు వెలవెలబోతున్నాయి. ఆ హోటల్ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ అడిగా మాట్లాడుతూ.. "మాకు అందాల్సిన సిలిండర్లలో కేవలం 20% మాత్రమే అందుతున్నాయి. గ్యాస్ ఆదా చేయడం కోసం మేం ఒకేసారి వాడే తవాల సంఖ్యను తగ్గించాం. ఇలా అయితే మరో రెండు రోజుల కంటే ఎక్కువ కాలం హోటల్ నడపలేం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్లాక్ మార్కెట్ దందా.. ఆకాశానికి ధరలు

దక్షిణ భారత వంటకాలకు, ముఖ్యంగా దోసెల తయారీకి స్థిరమైన మంట అవసరం. గ్యాస్ లేకపోతే ఈ రుచులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కొన్ని హోటళ్లు మెనూలను కుదించగా, మరికొన్ని హోటళ్లు పని గంటలను తగ్గించుకుంటున్నాయి.అధికారికంగా రూ. 1,940 ఉండాల్సిన 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర, బ్లాక్ మార్కెట్‌లో రూ. 2,800 నుండి రూ. 3,000 వరకు పలుకుతోంది. ఇంత పెట్టి కొందామన్నా స్టాక్ దొరకని పరిస్థితి. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ప్రత్యామ్నాయంగా డీజిల్ బర్నర్లను వాడదామన్నా అవి సురక్షితం కావని హోటల్ యజమానుల అసోసియేషన్ ఆందోళన చెందుతోంది.

ప్రభావం ఎవరి మీద?

ఈ గ్యాస్ కొరత కేవలం హోటల్ యజమానులకే కాదు, నగరంలోని లక్షలాది మందిపై ప్రభావం చూపుతోంది.ఇంటికి దూరంగా ఉంటూ హోటళ్లు, మెస్సులపై ఆధారపడే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు భోజన కష్టాలు మొదలయ్యాయి.పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మంటపాలు, హాస్టళ్లు, ఈవెంట్ వెన్యూలలో వంటలు ఆగిపోయే ప్రమాదం ఉంది. హోటల్ నిర్వాహకులు ధరలు పెంచడం లేదా హోటళ్లను మూసివేయడం వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాస్తూ, ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని కోరారు. బెంగళూరు వంటి మెట్రో నగరంలో గ్యాస్ సరఫరా నిలిచిపోతే అది జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. సరఫరాను పునరుద్ధరించాలని లేదా కనీసం రేషన్ పద్ధతిలోనైనా సిలిండర్లు అందేలా చూడాలని కోరారు. మరికొన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే, బెంగళూరులోని మెజారిటీ హోటళ్లు బోర్డులు తిప్పేయడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితేనే ఈ 'గ్యాస్' గండం గట్టెక్కుతుంది.

Naresh.k

Naresh.k

Next Story