LPG Cylinder: నిలిచిపోయిన సప్లై... ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర 8,200
LPG Cylinder: పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం పరాకాష్ఠకు చేరుకుంది.
LPG Cylinder
LPG Cylinder: పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం పరాకాష్ఠకు చేరుకుంది. సరిహద్దుల గుండా ఇరాన్ నుంచి జరిగే గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే 12 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 4,500 పాకిస్థానీ రూపాయిల నుంచి ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకింది. ప్రస్తుతం లాహోర్‌లో సిలిండర్ ధర దాదాపు 7,500 పాకిస్థానీ రూపాయిలకు చేరగా, స్కర్దూ ప్రాంతంలో ఏకంగా 8,200 పాకిస్థానీ రూపాయిల వద్ద విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రేట్లు 3,296 రూపాయిలుగా ఉన్నప్పటికీ మార్కెట్లో వ్యాపారులు రెట్టింపు కంటే ఎక్కువ ధరకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతుండటం గమనార్హం.
సరిహద్దులు మూసివేతతో దెబ్బతిన్న గ్యాస్ సరఫరా
ఈ తీవ్రమైన గ్యాస్ సంక్షోభానికి ప్రధాన కారణం పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దుల్లోని కీలకమైన చెక్‌పోస్టులు అక్టోబర్ 17 నుంచి మూతపడడమే. భద్రతా కారణాలు, అక్రమ రవాణాను అడ్డుకోవడానికే తాము సరిహద్దులను మూసివేసినట్లు పాకిస్థాన్ వెల్లడించగా, సాంకేతిక కారణాల వల్లే బంద్ చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ వివాదం కారణంగా ఇరాన్ నుంచి సరకు రవాణా నిలిచిపోవడంతో పాకిస్థాన్ స్థానిక మార్కెట్లలో తీవ్ర కొరత ఏర్పడింది. అక్కడ విపరీతంగా పెరిగిన ధరల వల్ల సామాన్య గృహిణులు పొయ్యి వెలిగించడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్‌లో పూర్తి స్థిరంగా గ్యాస్ సిలిండర్ ధరలు
పాకిస్థాన్‌లో గ్యాస్ మంటలు మండుతుంటే మన భారతీయ మార్కెట్లో మాత్రం వినియోగదారులకు ఊరట లభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.942 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పాకిస్థానీ కరెన్సీ విలువతో పోలిస్తే ఇది దాదాపు 2,743 పాకిస్థానీ రూపాయిలకు సమానం. నివేదికల ప్రకారం మనదేశంలో జూన్ 7వ తేదీ నుంచి గృహ వినియోగ గ్యాస్ ధరలలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ఇతర ప్రధాన నగరాలైన ముంబైలో రూ.941.50, అహ్మదాబాద్‌లో రూ.949, చెన్నైలో రూ.957.50 వద్ద ధరలు కొనసాగుతున్నాయి.
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ పెంపునకు కసరత్తు
ఇదిలా ఉండగా భారత్‌లోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు త్వరలోనే తీపి కబురు అందే సూచనలు కనిపిస్తున్నాయి. డీలర్ల లాభాల కమిషన్‌ను సవరించడానికి ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) సంస్థలు ఒకే తాటిపైకి వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్ల సుదీర్ఘ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ పరి పరిశీలనలో ఉన్నందున త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
అంతర్జాతీయ కచ్చానూనె ప్రభావం అలాగే రాబోయే రోజులు
ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో ఒడుదొడుకులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు వాణిజ్య రీఫిళ్ల ధరలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అక్టోబర్ 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై పెంచిన రూ.62.50 మార్పు తప్ప గృహ అవసరాల సిలిండర్ పై ఎటువంటి భారం పడలేదు. అయితే వెస్ట్ ఏషియా యుద్ద వాతావరణం మరింత ముదిరితే రాబోయే నెలల్లో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.




