LPG e-KYC Last Date: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. నేటి నుంచి సిలిండర్ బుకింగ్స్ నిలిపివేత
LPG e-KYC Last Date: ఎల్‌పీజీ ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో సబ్సిడీ ఆగిపోతుందేమోనన్న భయం వినియోగదారులను వెంటాడుతోంది.
Gas Cylinder
LPG e-KYC Last Date: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ అయింది. ఎల్‌పీజీ ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో సబ్సిడీ ఆగిపోతుందేమోనన్న భయం వినియోగదారులను వెంటాడుతోంది. గడువును పెంచాలని కస్టమర్లు కోరుతున్నప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం నియమాలను కఠినతరం చేశాయి. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఆగస్టు 24 నుంచి సిలిండర్ బుకింగ్స్, సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఇచ్చిన గడువు ఆగస్టు 23తో ముగిసింది. మొదట ఆగస్టు 16 వరకు ఉన్న సమయాన్ని వారం రోజుల పాటు పొడిగించారు. ఆగస్టు 31 వరకు గడువును మళ్లీ పెంచాలని కస్టమర్లు, డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కంపెనీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఆగస్టు 24 నుంచి ఈ-కేవైసీ లేని వినియోగదారులకు సిలిండర్ బుకింగ్‌లో సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం
ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. కస్టమర్ల ఖాతాలోకి వచ్చే నగదు బదిలీ ఆగడమే కాకుండా కొత్తగా సిలిండర్ బుక్ చేసుకోవడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు పెరగకపోయినప్పటికీ సబ్సిడీ ఆగిపోతే పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడనుంది.
ఏజెన్సీల వద్ద కిక్కిరిసిన క్యూ లైన్లు
పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 87 శాతం మంది బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేశారు. అక్కడ దాదాపు 2.7 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పేర్లలో తప్పులు, అడ్రస్ మార్పుల కారణంగా చాలామంది ప్రక్రియ ఆలస్యమైంది. సర్వర్ సమస్యలు, మొబైల్ యాప్‌లలో సాంకేతిక లోపాల వల్ల ఆన్‌లైన్ వెరిఫికేషన్ కాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చింది.
ఈ-కేవైసీ సేవలు శాశ్వతంగా ఆగిపోవు
గడువు ముగిసినంత మాత్రాన ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోదని ఎల్‌పీజీ డీలర్లు వెల్లడించారు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని తెలిపారు. గడువు దాటినప్పటికీ వినియోగదారులు ఆందోళన చెందకుండా తమ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. లేదా ఆయిల్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ విధానంలో వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఎల్‌పీజీ సబ్సిడీ, సిలిండర్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే కస్టమర్లు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. గ్యాస్ ఏజెన్సీని సందర్శించి లేదా యాప్ ద్వారా బయోమెట్రిక్ పూర్తి చేసి నిరంతర సేవలను పొందవచ్చు.




