Cooking Gas : గ్యాస్ బుకింగ్ చింత లేదు.. డెలివరీ కోసం వెయిటింగ్ లేదు..సామాన్యుడికి కేంద్రం బంపర్ ఆఫర్
Cooking Gas : కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై ఒత్తిడి తగ్గించేందుకు పీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. మార్చి 31లోపు కొత్త కనెక్షన్ తీసుకుంటే రూ. 500 ఉచిత గ్యాస్‌తో పాటు సెక్యూరిటీ డిపాజిట్ల రద్దు వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Cooking Gas
Cooking Gas : దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సరఫరాపై పెరుగుతున్న డిమాండ్ ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు దిగుమతులకు ఆటంకాలు కలుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులను పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లించేందుకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోని వాణిజ్య, గృహ వినియోగదారులు వెంటనే పీఎన్‌జీకి మారడం వల్ల దేశ ఇంధన భద్రతకు మేలు జరుగుతుంది.
గ్యాస్ కంపెనీల బంపర్ ఆఫర్లు
కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు గ్యాస్ పంపిణీ సంస్థలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL), GAIL గ్యాస్ మార్చి 31, 2026 లోపు కనెక్షన్ తీసుకుని గ్యాస్ వినియోగం ప్రారంభించే వారికి రూ.500 విలువైన ఉచిత గ్యాస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అటు ముంబైకి చెందిన మహానగర్ గ్యాస్ (MGL) ఒక అడుగు ముందుకేసి గృహ వినియోగదారులకు రూ.500 రిజిస్ట్రేషన్ ఛార్జీని రద్దు చేయడమే కాకుండా, వాణిజ్య వినియోగదారుల (హోటళ్లు, ఆసుపత్రులు) కోసం రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఉండే సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా తీసివేసింది. భారత్ పెట్రోలియం (BPCL) కూడా వాణిజ్య కనెక్షన్లపై సెక్యూరిటీ డిపాజిట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పీఎన్‌జీ ఎందుకు మేలు?
ఎల్పీజీతో పోలిస్తే పీఎన్‌జీ మరింత సురక్షితమైనది, సౌకర్యవంతమైనది. పీఎన్‌జీ గాలి కంటే తేలికగా ఉండటం వల్ల లీకేజీ జరిగినా వెంటనే గాలిలో కలిసిపోతుంది, తద్వారా ప్రమాదాల ముప్పు తక్కువ. అంతేకాకుండా, సిలిండర్లను బుక్ చేయడం, డెలివరీ కోసం వేచి చూడటం లేదా నిల్వ చేయడం వంటి ఇబ్బందులు ఉండవు. ఇది నేరుగా పైపుల ద్వారా 24 గంటలూ సరఫరా అవుతుంది. వినియోగదారులు ఎంత వాడుకుంటే అంతకే బిల్లు చెల్లించే సదుపాయం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం గల్ఫ్ దేశాల మధ్య యుద్ధం వల్ల ఎల్పీజీ దిగుమతులు తగ్గినా, పీఎన్‌జీ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
ప్రభుత్వ చర్యలు
దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.6 కోట్లకు పైగా పీఎన్‌జీ కనెక్షన్లు ఉండగా, ఈ సంఖ్యను వేగంగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) హెల్ప్‌లైన్లను, ఆన్‌లైన్ పోర్టళ్లను అందుబాటులోకి తెచ్చింది. పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉన్న చోట దరఖాస్తు చేసుకున్న అతి తక్కువ సమయంలోనే కనెక్షన్ ఇచ్చేలా గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటోంది.




