LPG Price Hike: సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర

LPG Price Hike: నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో రూ.10, చెన్నైలో రూ.11.50 పెరుగుదల నమోదైంది.

CR Reddy
Published on: 1 Nov 2026 5:49 AM IST
LPG Price Hike
X

LPG Price Hike

LPG Price Hike: నవంబర్ మొదటి రోజే వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. దీపావళి పండుగకు ముందు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారులకు ఈ పెంపు అదనపు భారంగా మారనుంది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,810 నుంచి రూ.2,820కి చేరింది. అంటే ఒక్క సిలిండర్‌పై రూ.10 పెరిగింది. అక్టోబర్ 1న కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. అప్పుడు ఢిల్లీలో రూ.62.50 పెరగడంతో సిలిండర్ ధర రూ.2,810కి చేరింది. ఇప్పుడు మరోసారి ధర పెరగడంతో వ్యాపారులకు ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే ఇళ్లలో వంటకు ఉపయోగించే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఈసారి మార్పు లేదు.

హైదరాబాద్‌లో ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులు హైదరాబాద్ ధరలపైనా ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,065గా ఉంది.ఇక హైదరాబాద్‌లో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.994గా నమోదైంది.

ఇతర నగరాల్లో కొత్త ధరలు

దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు వేర్వేరుగా పెరిగాయి. చెన్నైలో అక్టోబర్‌లో రూ.2,983గా ఉన్న 19 కిలోల సిలిండర్ ధర నవంబర్ 1 నుంచి రూ.2,994.50కి చేరింది. అంటే రూ.11.50 పెరిగింది. అహ్మదాబాద్‌లో రూ.2,831.50 నుంచి రూ.2,842కి చేరడంతో రూ.10.50 పెరుగుదల నమోదైంది. పాట్నాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,132కి చేరింది. లక్నోలో రూ.2,942గా ఉంది. షిల్లాంగ్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,091కు చేరింది. మరోవైపు ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,764గా ఉంది. గృహ వినియోగ సిలిండర్ ధరలు మాత్రం ఈ నగరాల్లోనూ మారలేదు.

హోటళ్లపై పడనున్న భారం

19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, ఢాబాలు, క్యాటరింగ్ సంస్థలు ఎక్కువగా ఉపయోగిస్తాయి. వీటికి గ్యాస్ అనేది రోజువారీ నిర్వహణలో కీలకమైన ఖర్చు. సిలిండర్ ధర పెరిగితే వంట ఖర్చు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రోజుకు ఎక్కువ సిలిండర్లు వినియోగించే పెద్ద హోటళ్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. పెరిగిన ఖర్చును వ్యాపారులు తమ లాభాల్లో భరించాలా? లేక టిఫిన్లు, భోజనాల ధరలు పెంచాలా? అనేది వారి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే గ్యాస్ ధర పెరిగిందని వెంటనే హోటల్ బిల్లులు పెరుగుతాయని చెప్పలేం.

12 ఏళ్లలో భారీ మార్పులు

ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే గత 12 ఏళ్లలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2014 నవంబర్‌లో రూ.1,449గా ఉన్న ధర 2015లో రూ.1,009కు, 2016లో రూ.968కు తగ్గింది. 2018 నవంబర్‌లో రూ.1,606.50కి చేరింది. 2021లో రూ.2,000.50 దాటింది. ఆ తర్వాత కొంత తగ్గుతూ 2025 నవంబర్‌లో రూ.1,590.50గా నమోదైంది. ఇప్పుడు 2026 నవంబర్‌లో రూ.2,820కి చేరింది. అంటే గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల కనిపిస్తోంది. గ్యాస్ ధరల మార్పులు హోటల్ వ్యాపారులకే కాదు, బయట భోజనం చేసే సామాన్యుల ఖర్చులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.