వంట నూనెపై సర్కార్ కొరడా.. లూజ్‌గా అమ్మితే ఇక అంతే!
మహారాష్ట్రలో లూజ్ వంట నూనె అమ్మకాలపై FDA నిషేధం విధించింది. ఇకపై ప్యాక్ చేసిన నూనెనే విక్రయించాలి. నిబంధనలు పాటించాలి.
Loose Cooking Oil Sales
మహారాష్ట్రలో లూజ్‌గా వంట నూనె విక్రయించడంపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిషేధం విధించింది. కల్తీ, నాణ్యత లేని నూనెల విక్రయాలను అరికట్టడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై రాష్ట్రంలో ప్యాక్ చేసిన వంట నూనెను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.
వంట నూనె ప్యాకెట్‌పై దాని మూలం, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలు స్పష్టంగా ఉండేలా చూడాలని FDA ఆదేశించింది. లూజ్‌గా విక్రయించే నూనె ఎక్కడ తయారైందో, ఎప్పుడు తయారైందో, దాని గడువు ఎంత అనే వివరాలను గుర్తించడం కష్టమవుతోందని అధికారులు పేర్కొన్నారు.
కల్తీని అరికట్టేందుకే నిర్ణయం
లూజ్ నూనె కారణంగా ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు దాని మూలాన్ని గుర్తించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం కష్టంగా మారుతుందని FDA తెలిపింది. ప్యాక్ చేసిన నూనె ద్వారా ఉత్పత్తి మూలం, తయారీ వివరాలు, గడువు వంటి సమాచారాన్ని సులభంగా గుర్తించవచ్చని అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సురక్షిత ఆహారం, సురక్షిత మహారాష్ట్ర’ కార్యక్రమంలో భాగంగా వంట నూనెపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. నూనె తయారీ నుంచి ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్ విక్రయాల వరకు ప్రతి దశలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ బిజినెస్‌లలో వంట నూనెను పదేపదే వేడి చేసి ఉపయోగించే విధానాలపై FDA ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టనుంది. నూనెను పదే పదే వేడి చేసి ఉపయోగించడం ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
అలాగే వంట నూనె ప్యాకేజింగ్‌కు ఉపయోగించిన టిన్‌లను నిబంధనలకు విరుద్ధంగా తిరిగి వినియోగించడంపైనా అధికారులు దృష్టి పెట్టారు. తయారీదారులు, పంపిణీదారులు, వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత లైసెన్సులు, FSSAI నిబంధనలు పాటించాలని FDA స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తాజా నిర్ణయంతో మహారాష్ట్రలో వంట నూనె విక్రయాలు, వినియోగంపై పర్యవేక్షణ మరింత కఠినతరం కానుంది.




