UPI: అక్టోబర్ 15 నుంచి యూపీఐ నిబంధనలలో మార్పులు.. రూ.2000 దాటితే బాదుడే

UPI: రాబోయే అక్టోబర్ 15 నుంచి కొన్ని P2M యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది.

CR Reddy
Published on: 16 Sept 2026 6:47 AM IST
UPI
X

UPI

UPI: భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని పూర్తిగా మార్చేసిన యూపీఐ సేవలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ప్రకటన చేసింది. రాబోయే అక్టోబర్ 15 నుంచి కొన్ని P2M యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది. అయితే ఈ కొత్త నిబంధనలు సాధారణ వినియోగదారులపై ఎటువంటి భారాన్ని మోపవని స్పష్టం చేశారు.

సాధారణ వినియోగదారులకు పూర్తిగా ఉచితం

ఎన్‌పీసీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు యూపీఐ ద్వారా ఎంత డబ్బు పంపినా ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత లావాదేవీలు (P2P) ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి. కేవలం వ్యాపారులకు (P2M) జరిగే కొన్ని నిర్దిష్ట చెల్లింపులపై మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. దీనివల్ల సాధారణ ప్రజల దైనందిన డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగదు.

రూ.2000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు

మార్కెట్లో జరిగే రోజువారీ యూపీఐ లావాదేవీలలో సుమారు 95 శాతానికి పైగా రూ.2,000 లోపు ఉండేవే. ఈ కారణంగా రూ.2,000 లోపు విలువైన లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ (MDR) ఛార్జీ వసూలు చేయరు. ఒకవేళ లావాదేవీ విలువ రూ.2,000 దాటితే మాత్రం, వ్యాపారులు నిర్దిష్ట పరిమితి ప్రకారం 0.4 శాతం వరకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి గరిష్టంగా రూ.300 వరకు మాత్రమే ఫీజు అమల్లో ఉంటుంది.

చిన్న వ్యాపారులకు ప్రత్యేక రక్షణ

చిన్న వ్యాపారులు, వెండర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌పీసీఐ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.లక్ష వరకు లావాదేవీలు పొందే చిన్న వ్యాపారులకు ఈ ఎండీఆర్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల చిన్న స్థాయి దుకాణదారులు ఎలాంటి భయం లేకుండా యూపీఐ సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చు.

కొన్ని ప్రత్యేక రంగాలకు రాయితీలు

ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో కొన్ని ప్రత్యేక రంగాలకు రాయితీ ధరలను ప్రకటించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు సంబంధించి రూ.2,000 కంటే ఎక్కువ లావాదేవీలపై స్టాండర్డ్ 0.4 శాతానికి బదులుగా కేవలం రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ మాత్రమే వర్తిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్ల వంటి క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై 0.02 శాతం చొప్పున గరిష్టంగా రూ.300 వరకు ఛార్జీ ఉంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.