Petrol Price : కేంద్రం బంపర్ ఆఫర్.. పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 13 ట్యాక్స్ కట్

Petrol Price : ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది, డీజిల్‌పై పన్నును పూర్తిగా రద్దు చేసింది. యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా, సామాన్యులకు ఊరటనిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

CR Reddy
Published on: 27 March 2026 9:27 AM IST
Petrol Price
X

Petrol Price

Petrol Price : ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుని, ముడిచమురు ధరలు మండిపోతున్న వేళ భారత ప్రభుత్వం సామాన్యులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. వాహనదారుల జేబులకు చిల్లు పడకుండా ఉండేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒక్కసారిగా దిగిరానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్నా, దేశీయంగా సామాన్యులపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం.. పెట్రోల్‌పై గతంలో ఉన్న రూ.13 ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా రూ.3కి తగ్గించారు. అంటే లీటరుకు రూ.10 నేరుగా తగ్గనుంది. ఇక డీజిల్ విషయానికి వస్తే, ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించింది. గతంలో ఉన్న రూ.10 సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ సున్నాకు తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి రావడంతో వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.

యుద్ధం ముదిరినా.. తగ్గని పట్టు

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ముడిచమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గంపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో చమురు దిగుమతులు భారంగా మారాయి. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 15 శాతం వరకు ఈ మార్గం ద్వారానే పొందుతుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం పన్నులను తగ్గించి, ఇంధన భారాన్ని తన భుజాన వేసుకోవడం విశేషం.

ద్రవ్యోల్బణానికి చెక్.. సామాన్యుడికి మేలు

ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల కేవలం వాహనదారులకే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. డీజిల్ ధరలు తగ్గడం వల్ల లారీలు, వ్యాన్‌ల వంటి రవాణా వాహనాల ఖర్చులు తగ్గుతాయి. దీనివల్ల కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఇతర నిత్యావసరాల ధరలు అదుపులోకి వస్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వేసిన ఈ అడుగు మధ్యతరగతి ప్రజల కుటుంబ బడ్జెట్‌కు పెద్ద ఊరటనిస్తుంది.

వివిధ ఆర్థిక విశ్లేషణల ప్రకారం, ఈ సుంకం తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా వేల కోట్ల రూపాయల భారం పడనుంది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటబోతున్న తరుణంలో, ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు ఏళ్లుగా ఇంధన ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ మార్చి 27 నిర్ణయం నిజంగానే పెద్ద రిలీఫ్. పశ్చిమ దేశాల్లో చమురు కొరత ఏర్పడుతున్నా, భారత్ మాత్రం తన వ్యూహాత్మక నిల్వలు, పన్ను తగ్గింపులతో ప్రజలను ఆదుకుంటోంది.

CR Reddy

CR Reddy

Next Story