Sudha Reddy: ఎవరీ సుధా రెడ్డి...? రూ. 142 కోట్ల నెక్లెస్‌తో ఎంట్రీ

Sudha Reddy: మెట్ గాలా 2026 వేదికపై హైదరాబాద్ పారిశ్రామికవేత్త సుధా రెడ్డి అరుదైన రికార్డు.

Naresh.k
Published on: 7 May 2026 8:09 AM IST
Sudha Reddy
X

Sudha Reddy: ఎవరీ సుధా రెడ్డి...? రూ. 142 కోట్ల నెక్లెస్‌తో ఎంట్రీ

Met Gala 2026: న్యూయార్క్ వేదికగా జరిగిన గ్లామర్ ప్రపంచపు అతిపెద్ద పండుగ 'మెట్ గాలా 2026'లో మరోసారి భారతీయ జెండా రెపరెపలాడింది. హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయేలా, కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు.. వేల గంటల శ్రమతో రూపొందిన వస్త్రధారణతో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త సుధా రెడ్డి ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఫ్యాషన్ ప్రపంచంలో ఆస్కార్‌గా భావించే మెట్ గాలాలో ఈసారి అందరి చూపు సుధా రెడ్డిపైనే. కేవలం సంపదను ప్రదర్శించడమే కాకుండా, భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా తెలుగు నేల గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన ఆమె తీరు అద్భుతం. సుధా రెడ్డి మెడలో మెరిసిన ఆ నెక్లెస్ విలువ అక్షరాలా రూ. 142 కోట్లు. పెద్ద సైజులో ఉండే రోజ్-కట్ డైమండ్స్‌తో ఈ ఆభరణాన్ని అత్యంత కళాత్మకంగా రూపొందించారు. దీనితో పాటు ఆమె ధరించిన 30 క్యారెట్ల డైమండ్ రింగ్, 40 క్యారెట్ల కొలంబియన్ ఎమరాల్డ్ రింగ్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ గౌను కేవలం ఒక డ్రెస్ మాత్రమే కాదు, ఒక దృశ్య కావ్యం. ఇందులో మన జమ్మి చెట్టు, పాలపిట్ట, తంగేడు పువ్వు, కల్పవృక్షం వంటి మోటిఫ్‌లను పొందుపరిచారు. ఈ వస్త్రాన్ని తయారు చేయడానికి దాదాపు 90 మంది కళాకారులు 3400 గంటలకు పైగా శ్రమించారు. 3 వేల ఏళ్ల నాటి మచిలీపట్నం కలంకారీ శైలిలో ఈ గౌను రూపుదిద్దుకుంది. హైదరాబాద్‌లోని వృక్ష, జంతుజాలాల ఆకృతుల్ని రేషన్ జరీతో నేయడం విశేషం.

ఎవరీ సుధా రెడ్డి..?

హైదరాబాద్‌కు చెందిన ఈమె కేవలం ఫ్యాషన్ ఐకాన్ మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన బిజినెస్ ఉమెన్ కూడా. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్. మేఘా గ్రూప్ అధినేత పి.వి. కృష్ణారెడ్డి సతీమణి. సుధారెడ్డి ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారత, క్యాన్సర్ కేర్, విద్య వంటి రంగాల్లో ఎంతో సేవ చేస్తున్నారు. యునిసెఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

2021, 2024 తర్వాత 2026లోనూ మెట్ గాలాలో పాల్గొని సుధా రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. గతంలో రూ. 65 కోట్ల డైమండ్ జ్యువెలరీతో వార్తల్లో నిలిచిన ఆమె, ఈసారి అంతకు మించిన మెరుపులతో గ్లోబల్ ఫ్యాషన్ మ్యాగజైన్ల కవర్ పేజీలపై నిలిచారు. న్యూయార్క్ రెడ్ కార్పెట్‌పై హైదరాబాద్ వైభవాన్ని చాటిన ఆమెపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story