Layoffs: 14,000 మంది ఉద్యోగులపై వేటు వేసిన టెక్ దిగ్గజం
Layoffs: టెక్ దిగ్గజం మెటా మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ఏఐ ప్రాజెక్టుల కోసం నిధులు మళ్లించే క్రమంలో 14,000 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది.
Layoffs: 14,000 మంది ఉద్యోగులపై వేటు వేసిన టెక్ దిగ్గజం
Meta: సాఫ్ట్‌వేర్ రంగంలో మరోసారి గండం ముంచుకొచ్చింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ఒకవైపు కొత్త అవకాశాలను సృష్టిస్తుంటే, మరోవైపు ఉన్న ఉద్యోగాలను ఊడ్చేస్తోందనే చేదు నిజాన్ని మెటా లేఆఫ్స్ స్పష్టం చేస్తున్నాయి.
లేఆఫ్స్ లెక్కలు ఇవే..
ప్రస్తుతం మెటాలో దాదాపు 80,000 మంది ఉద్యోగులు ఉండగా, అందులో 10 శాతం అంటే 8,000 మందిని ఇంటికి పంపేందుకు మార్క్ జుకర్‌బర్గ్ సిద్ధమయ్యారు. అంతేకాదు, గతంలో భర్తీ చేయాలని నిర్ణయించుకున్న మరో 6,000 ఓపెన్ పొజిషన్లను కూడా రద్దు చేశారు. వెరసి, మొత్తం 14,000 ఉద్యోగాలపై మెటా నిర్ణయం చావుదెబ్బ కొట్టింది. ఈ తొలి విడత తొలగింపులు మే 20 నుండి ప్రారంభం కానున్నాయి.
లాభమే పరమావధిగా!
2023లో ఇప్పటికే 21,000 మందిని తొలగించిన మెటా, మళ్ళీ ఇప్పుడు ఇంత భారీ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.సంస్థను మరింత వేగవంతంగా, లాభదాయకంగా మార్చాలని జుకర్‌బర్గ్ భావిస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో పోటీ పడటానికి మెటా తన Llama మోడల్స్ పై బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఉద్యోగుల జీతాల రూపంలో పోయే నిధులను తగ్గించి, వాటిని పూర్తిస్థాయిలో AI ప్రాజెక్టుల వైపు మళ్లించడమే మెటా అసలు వ్యూహం.
ఎవరికి ముప్పు?
మెటా వంటి అగ్రగామి సంస్థలే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, చిన్న టెక్ కంపెనీలు కూడా అదే బాట పట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కింద పేర్కొన్న విభాగాలపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కోడింగ్ పనులను ఏఐ సులభం చేయడంతో నియామకాలు తగ్గుతున్నాయి.పోస్ట్‌లను ఫిల్టర్ చేయడానికి ఇప్పుడు మానవ వనరుల కంటే ఏఐ బాట్లను ఎక్కువగా వాడుతున్నారు.సాధారణ డేటా మేనేజ్‌మెంట్ పనులకు మనుషుల అవసరం తగ్గుతోంది.
టెక్కీలు ఏం చేయాలంటే..?
ఈ పరిణామాలు టెక్ నిపుణులకు ఒక హెచ్చరిక లాంటివి. సాంకేతికత మారినప్పుడు, మనం కూడా మారాలి అనే సూత్రం ఇప్పుడు తప్పనిసరి. కేవలం పాత పద్ధతుల్లో కోడింగ్‌కు పరిమితం కాకుండా.. ఏఐ టూల్స్ వాడకం, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలి. సాంకేతిక విప్లవం ఎప్పుడూ పాత పద్ధతులను తుడిచిపెట్టేస్తుంది. మెటా తాజా లేఆఫ్స్ ప్రక్రియ 2026 ద్వితీయార్థంలో కూడా మరిన్ని దశల్లో కొనసాగే అవకాశం ఉన్నందున, ఐటీ రంగం నిలకడగా ఉండే వరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండక తప్పదు.




