మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సత్య నాదెళ్ల విచారం.. కీలక వ్యాఖ్యలు
Microsoft Cloud: ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడినందుకు సత్య నాదెళ్ల విచారం వ్యక్తం చేశారు.
మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సత్య నాదెళ్ల విచారం.. కీలక వ్యాఖ్యలు
Microsoft Cloud: మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయంపై సంస్థ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యను ముందే నివారించడంలో తాము ఇంకాస్త మెరుగ్గా పనిచేసి ఉండాల్సిందని అంగీకరించారు. సీఎన్‌బీసీతో మాట్లాడిన నాదెళ్ల.. సాఫ్ట్‌వేర్‌లో దాగి ఉన్న ఒక బగ్ ఒక్కసారిగా నిర్దిష్ట యూజర్ ట్రాఫిక్‌ను ఎదుర్కోవడంతోనే వ్యవస్థలో అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు.
టెస్టింగ్‌లో లోపం.. సైబర్ దాడి కాదు
పరీక్షల దశలోనే ఈ సాఫ్ట్‌వేర్ లోపాన్ని గుర్తించడంలో విఫలమయ్యామని సత్య నాదెళ్ల చెప్పారు. చిన్న లోపం ప్రపంచవ్యాప్తంగా విస్తరించకుండా పటిష్ఠమైన రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. గత వారం ఔట్‌లుక్‌లో మొదలైన ఈ సమస్య.. ఆ తర్వాత టీమ్స్, కోపైలట్, మైక్రోసాఫ్ట్ 365, షేర్‌పాయింట్, వన్‌డ్రైవ్ వంటి ప్రధాన సేవలకు విస్తరించింది. దాదాపు రోజుకు పైగా సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది ఆరంభంలోనే సిస్టమ్‌లోకి చేరిన బగ్‌తో పాటు భారీ ట్రాఫిక్, సర్వర్ సామర్థ్యం తగ్గడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అయితే దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్ తేల్చి చెప్పింది.
పాత వ్యవస్థలపై కొత్త ప్యాచ్‌ల ఒత్తిడి
ఈ ఘటన మొత్తం టెక్ రంగానికి ఒక హెచ్చరికలాంటిదని నాదెళ్ల విశ్లేషించారు. ఏఐ సాయంతో సాఫ్ట్‌వేర్ రూపకల్పన, లోపాల గుర్తింపు వేగంగా జరుగుతున్నప్పటికీ.. వాటిని పాత టెక్నాలజీ వ్యవస్థల్లోకి హడావుడిగా చేర్చడం వల్ల ఆపరేషనల్ రిస్క్‌లు పెరుగుతున్నాయని చెప్పారు. కొత్త అప్‌డేట్‌లను పాత వ్యవస్థలు తట్టుకోలేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని వివరించారు. ఇగ్నైట్ సదస్సులో కోపైలట్‌ను పని ప్రదేశాల్లో కీలక వేదికగా నిలుపుతామని ప్రకటించిన వెంటనే ఈ అంతరాయం రావడం కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది.




