Microsoft Layoffs: షాకింగ్ న్యూస్.. ఏకంగా 60000 మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఉద్వాసన

Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగంలో మళ్లీ ఉద్యోగాల కోత కలకలం రేపుతోంది

CR Reddy
Published on: 27 Oct 2026 7:38 AM IST
Microsoft Layoffs
X

Microsoft Layoffs

Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగంలో మళ్లీ ఉద్యోగాల కోత కలకలం రేపుతోంది. ఒకవైపు కొన్ని కంపెనీలు కొత్త నియామకాలు చేపడుతుండగా, మరోవైపు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మాత్రం భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. కృత్రిమ మేధస్సు (AI) రంగంలోకి భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కంపెనీ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా ఏకంగా 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలేసే సరికొత్త ఆఫర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న ఉద్యోగులకు కంపెనీ భారీ ఆర్థిక ప్యాకేజీని అందజేయనుంది.

ఏఐ రంగంలో కాస్ట్ కట్టింగ్ వ్యూహం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి అలాగే కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ఈ భారీ ఖర్చులను భరించేందుకు వీలుగా కంపెనీ తన నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తోంది. వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువన ఉన్న కొన్ని ప్రత్యేక విభాగాల ఉద్యోగులను ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. అయితే కీలకమైన డేటా సెంటర్లు, సేల్స్ అలాగే మార్కెటింగ్ విభాగాలకు చెందిన సిబ్బందిని మాత్రం ఈ జాబితా నుంచి మినహాయించినట్లు స్పష్టమైంది.

సాధారణ ఉద్యోగ విరమణ ప్యాకేజీ

కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఎమీ కోల్‌మన్ ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెసేజ్ లో ఈ విషయాలను స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని వీడాలని భావిస్తే, వారికి సాధారణ ఉద్యోగ విరమణ సమయంలో లభించే దానికంటే ఎక్కువ పరిహారం అందుతుందని తెలిపారు. అమెరికా, కెనడా, భారత్ అలాగే బ్రిటన్ దేశాల్లోని సెలెక్టెడ్ టీమ్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే కంపెనీకి అత్యంత అవసరమైన అత్యుత్తమ ప్రతిభావంతులు ఈ ఆఫర్‌ను ఎంచుకున్నప్పటికీ, వారిని ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మేనేజ్‌మెంట్ పేర్కొంది.

గూగుల్, మెటా బాటలో నడుస్తున్న మైక్రోసాఫ్ట్

కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. గతంలో గూగుల్ సంస్థ కూడా కొన్ని విభాగాల ఉద్యోగులకు ఇలాంటి ప్యాకేజీల ద్వారా ఉద్వాసన పలికింది. అలాగే ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సైతం తమ సిబ్బంది సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించుకుంది. రాబోయే కాలంలో ఏఐ ఆధారిత టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించనున్న నేపథ్యంలో, ఐటీ రంగంలో ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోతుందనేదానికి ఈ పరిణామాలు స్పష్టమైన సంకేతంగా నిలుస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.