Stock Rally: ఒక్కరోజే 156% పెరిగిన స్టాక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం!

Stock Rally: మెర్క్‌తో కలిసి మోడెర్నా చేసిన ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.

Naresh.k
Published on: 20 Aug 2026 10:27 AM IST
Stock Rally
X

Stock Rally: ఒక్కరోజే 156% పెరిగిన స్టాక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం!

Moderna Stock: షేర్ మార్కెట్‌లో కొన్నిసార్లు అనూహ్యమైన అద్భుతాలు జరుగుతుంటాయి. కంపెనీలు తీసుకునే సంచలన నిర్ణయాలు, కొత్త ఆవిష్కరణలు స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీకి కారణమవుతాయి. సరిగ్గా అలాంటి అద్భుతమే అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్‌ లో ఆవిష్కృతమైంది. కోవిడ్ వ్యాక్సిన్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ప్రముఖ బయోటెక్ దిగ్గజం మోడెర్నా, క్యాన్సర్ చికిత్సలో చారిత్రాత్మక విజయం సాధించామన్న ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు ఒక్కరోజే 156 శాతం పైగా ఎగిసిపడ్డాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రెండింతలకు పైగా పెరిగింది.

ప్రముఖ ఫార్మా సంస్థ మెర్క్‌తో కలిసి మోడెర్నా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్, స్కిన్ క్యాన్సర్ చికిత్సలో అద్భుతమైన ఫలితాలను సాధించింది.ఈ వ్యాక్సిన్ నిర్వహించిన ఫేస్-3 క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో రోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ mRNA టెక్నాలజీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి, క్యాన్సర్ కణాలలోని ప్రత్యేక ప్రోటీన్లను గుర్తించి వాటిని నాశనం చేస్తుంది.సంప్రదాయ కీమోథెరపీతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ సమయంలో వైరస్‌లతో పోరాడేందుకు ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ పరిజ్ఞానాన్ని, ఇప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి కూడా ఉపయోగించవచ్చని నిరూపించడమే ఈ భారీ స్టాక్ ర్యాలీకి ప్రధాన కారణం.

క్యాన్సర్ ట్రయల్స్ వార్త వెలువడగానే ఇన్వెస్టర్లు మోడెర్నా షేర్లను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక అరుదైన గెయిన్‌గా నిలిచింది. మోడెర్నా స్టాక్ గణాంకాలను పరిశీలిస్తే, క్రితం రోజు నాస్డాక్ మార్కెట్లో ఈ షేరు 62.96 డాలర్ల వద్ద ముగిసింది. క్యాన్సర్ వ్యాక్సిన్ విజయవంతమైందన్న సానుకూల వార్తతో మరుసటి రోజు ఏకంగా 116.02 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించి, ఆరంభంలోనే దాదాపు రెట్టింపు స్థాయిని అందుకుంది. ఆ తర్వాత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో ఏకంగా 156 శాతానికి పైగా లాభపడి, ఇంట్రాడేలో 158.88 డాలర్ల వద్ద 52 వారాల గరిష్ఠ ధరను నమోదు చేసింది.

ఆ తర్వాత కాస్త స్థిరపడి 149 శాతం లాభంతో 156.42 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఈ కంపెనీ 52 వారాల కనిష్ఠ ధర 22.28 డాలర్లుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్ క్యాప్ 5,520 కోట్ల డాలర్లకు అంటే మన రూపాయి విలువలో దాదాపు రూ. 4.5 లక్షల కోట్లకు పైగా చేరింది. బయోటెక్ రంగంలో ఈ ఘనత ఒక కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఇతర రకాల క్యాన్సర్లకు కూడా ఈ మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story