యాప్ క్యాబ్‌లలో మహిళల భద్రతపై NCW కీలక మార్గదర్శకాలు.. ఇవి తప్పనిసరి!

యాప్ క్యాబ్‌లలో మహిళల భద్రత కోసం NCW కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పానిక్ బటన్, డ్రైవర్ వెరిఫికేషన్ తప్పనిసరి కానున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Oct 2026 1:10 AM IST
NCW Issues New Safety Rules for Women in App Cabs
X

NCW Issues New Safety Rules for Women in App Cabs

App-Based Cabs Women Safety: యాప్ ఆధారిత క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రతకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ (NCW) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు క్యాబ్ అగ్రిగేటర్లు పలు చర్యలు తీసుకోవాలని సూచించింది. డ్రైవర్, వాహన ధ్రువీకరణ నుంచి ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితుల నిర్వహణ వరకు పలు అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచింది.

మహిళల భద్రత కోసం క్యాబ్‌లలో భౌతిక పానిక్ బటన్‌లు, ప్రయాణ మార్గం మారినప్పుడు తక్షణ అలర్ట్‌లు, ఎక్కువసేపు లేదా అనుమానాస్పదంగా వాహనం ఆగినప్పుడు పర్యవేక్షణ వంటి సదుపాయాలను కల్పించాలని NCW సూచించింది. అలాగే క్యాబ్ అగ్రిగేటర్లు 24 గంటలు పనిచేసే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

బుకింగ్ చేసే సమయంలో, ప్రయాణం కొనసాగుతున్నప్పుడు, ప్రయాణం పూర్తైన తర్వాత కూడా మహిళల భద్రత, బాధ్యతను మరింత బలోపేతం చేయడమే ఈ మార్గదర్శకాల ఉద్దేశమని NCW చైర్‌పర్సన్ విజయ రహత్కర్ తెలిపారు. ఈ మార్గదర్శకాలను అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది.

డ్రైవర్, వాహనం వివరాల్లో మార్పులుంటే అలర్ట్

యాప్‌లో చూపించిన డ్రైవర్ లేదా వాహనం కాకుండా వేరే వ్యక్తి లేదా వాహనం ప్రయాణానికి వచ్చినప్పుడు దాన్ని భద్రతా సమస్యగా పరిగణించాలని NCW స్పష్టం చేసింది. ఇలాంటి అనధికారిక మార్పులను యాప్‌లో వెంటనే గుర్తించేలా సదుపాయం ఉండాలని సూచించింది.

ప్రయాణికులు యాప్‌లో కనిపించే డ్రైవర్ ఫొటో, వాహనం వివరాలను సులభంగా ధ్రువీకరించుకునే అవకాశం ఉండాలని పేర్కొంది. డ్రైవర్ లేదా వాహనం వివరాల్లో తేడా ఉంటే మహిళా ప్రయాణికులకు ఎలాంటి పెనాల్టీ లేకుండా క్యాబ్‌ను రద్దు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించింది.

ఫిర్యాదుల పరిష్కారానికి గడువు

మహిళా ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించే విధానాన్ని అగ్రిగేటర్లు ఏర్పాటు చేయాలని NCW సూచించింది. అవసరమైన సందర్భాల్లో ఫిర్యాదులను పోలీసు, ఇతర చట్ట అమలు సంస్థలకు చేరవేసేలా ఎస్కలేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొంది.

అలాగే అగ్రిగేటర్లు తమ భద్రతా విధానాలు, ప్రామాణిక నిర్వహణ విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. భద్రతకు సంబంధించిన నివేదికలను కూడా క్రమం తప్పకుండా అందించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

మహిళా డ్రైవర్లకు ప్రత్యేక ఆప్షన్

మహిళా డ్రైవర్లతో కూడిన ధ్రువీకరించిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు అగ్రిగేటర్లు ప్రయత్నించాలని NCW సూచించింది. అందుబాటులో ఉండి, సాధ్యమైన సందర్భాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు యాప్ ద్వారా మహిళా డ్రైవర్‌ను కోరుకునే ఆప్షన్ ఇవ్వాలని పేర్కొంది.

అర్ధరాత్రి ప్రయాణాలపై ప్రత్యేక నిఘా

రాత్రి ఆలస్యంగా క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం అదనపు చర్యలు తీసుకోవాలని NCW సూచించింది. ప్రయాణం ప్రారంభించే సమయంలో డ్రైవర్ ఫొటోను తప్పనిసరిగా ధ్రువీకరించడం, డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపకుండా చర్యలు తీసుకోవడం వంటి విధానాలను అమలు చేయాలని తెలిపింది.

ప్రయాణికులు కోరుకుంటే క్యాబ్ ప్రయాణ వివరాలను వారి విశ్వసనీయ వ్యక్తులకు ఆటోమేటిక్‌గా షేర్ చేసే సదుపాయం కల్పించాలని సూచించింది. అలాగే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అదనపు పర్యవేక్షణ, ప్రయాణం ముగిసే సమయంలో సురక్షిత ప్రదేశంలో దింపే సేఫ్-డ్రాప్ ఆప్షన్ అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

డ్రైవర్ల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి

క్యాబ్ డ్రైవర్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్ర, పోలీస్ వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ చెక్ నిర్వహించాలని NCW సూచించింది. డ్రైవర్లు విధుల్లో చేరిన తర్వాత కూడా ఈ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని తెలిపింది.

అంతేకాకుండా డ్రైవర్లకు మహిళల భద్రత, లింగ సున్నితత్వంపై క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా యాప్ ఆధారిత రవాణా సేవల్లో మహిళలకు మరింత సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించవచ్చని NCW పేర్కొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్