Driving License: వాహనదారులకు బిగ్ అలర్ట్.. త్వరలోనే కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్

Driving License: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

CR Reddy
Published on: 5 Sept 2026 8:17 AM IST
Driving License
X

Driving License

Driving License: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇకపై రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు తోలితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ, నిర్వహణలో పాయింట్ల ఆధారిత వ్యవస్థ‎ను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు.

నయా పాయింట్ల సిస్టమ్.. తప్పు చేస్తే కట్

న్యూఢిల్లీలో నిర్వహించిన 66వ సియామ్ వార్షిక సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విప్లవాత్మక ప్రతిపాదనను బయటపెట్టారు. కొత్త విధానం ప్రకారం ప్రతి వాహనదారుని డ్రైవింగ్ లైసెన్స్‌కు కొన్ని నిర్దిష్ట పాయింట్లు కేటాయిస్తారు. రోడ్డుపై వెళ్లే సమయంలో ఓవర్ స్పీడింగ్, రెడ్ లైట్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు చేస్తే లైసెన్స్ నుంచి పాయింట్లు కట్ అవుతాయి. పాయింట్లు తగ్గే కొద్దీ సదరు డ్రైవర్‌పై చర్యల తీవ్రత పెరుగుతుంది.

పరిమితి దాటితే లైసెన్స్ శాశ్వతంగా రద్దు

ఒక పరిమితికి మించి పాయింట్లు కోల్పోతే ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు. అలవాటుగా పదేపదే నిబంధనలు ఉల్లంఘించే కరడుగట్టిన డ్రైవర్ల లైసెన్సులను పూర్తిగా రద్దు చేసేలా మోటార్ వాహనాల చట్టంలో సవరణలు చేయనున్నారు. ఇదే సమయంలో క్రమశిక్షణతో వాహనాలు నడిపే ఉత్తమ డ్రైవర్లకు గుడ్ పాయింట్స్ లభిస్తాయి. ఈ పాయింట్ల ఆధారంగా వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంలో భారీ డిస్కౌంట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఇన్సెంటివ్‌లు పొందే వెసులుబాటు కలగనుంది.

మరణాలను అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం

దేశంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, ఏకంగా 1.8 లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణమైన మరణాల్లో 72 శాతం మంది 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే ఉండటం శోచనీయం. దేశ భవిష్యత్తుకు వెన్నుముకలాంటి యువత ప్రమాదాల బారిన పడి బలవుతుండటంతో, క్రమశిక్షణను పెంచేందుకు ఈ పాయింట్ల వ్యవస్థే సరైన పరిష్కారమని కేంద్రం భావిస్తోంది.

భవిష్యత్తు ప్రణాళికలు

ప్రస్తుతం ఈ పాయింట్ల విధానం ప్రతిపాదన దశలో ఉందని, త్వరలోనే మోటార్ వాహనాల చట్ట సవరణల ద్వారా పూర్తి స్థాయి మార్గదర్శకాలు ఖరారు చేస్తామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దీనికి తోడు డ్రైవర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 1,600 అధునాతన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వాహనాల భద్రతను మెరుగుపరచడంలో భాగంగా 2027 నుంచి కార్ల కోసం భారత్ ఎన్‌సీఏపీ 2.0 సేఫ్టీ రేటింగ్స్ అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story