Internet Data Tax : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాక్.. ఇంటర్నెట్ పై కొత్త ట్యాక్స్ వేయనున్న కేంద్రం

Internet Data Tax : ఇంటర్నెట్ డేటా వాడకంపై కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధించే ఆలోచనలో ఉంది. ఆదాయం పెంచుకోవడంతో పాటు స్క్రీన్ అడిక్షన్ తగ్గించడమే లక్ష్యంగా సెప్టెంబర్ 2026 నాటికి దీనిపై నిర్ణయం వెలువడనుంది.

CR Reddy
Published on: 12 March 2026 8:14 AM IST
Internet Data Tax
X

Internet Data Tax

Internet Data Tax : స్మార్ట్‌ఫోన్ వాడకం, ఇంటర్నెట్ లేనిదే క్షణం గడవని రోజుల్లో ఉన్నాం. అలాంటి మనకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. మనం వాడే ఇంటర్నెట్ డేటాపై కొత్తగా పన్ను (Data Tax) వేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనం కట్టే రీఛార్జ్ రేట్లకు తోడు, ఇకపై ప్రతి జీబీ (GB) వాడకం మీద అదనపు పైసలు చెల్లించాల్సి రావచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల జరిగిన టెలికాం సమీక్షా సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం. రెండోది, ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతున్న స్క్రీన్ అడిక్షన్‎ను తగ్గించడం. సోషల్ మీడియా, ఓటీటీ కంటెంట్ వల్ల జనాలు గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లకే అతుక్కుపోతున్నారని, డేటాపై పన్ను విధిస్తే ఆ వాడకం కొంత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు ఇది ఒక మార్గమని అధికార వర్గాల మాట.

గణాంకాల ప్రకారం చూస్తే.. గత ఏడాది భారతీయులు ఏకంగా 229 బిలియన్ జీబీల డేటాను వాడేశారు. అంటే ప్రభుత్వం ప్రతి జీబీపై కేవలం ఒక్క రూపాయి చొప్పున పన్ను వేసినా, ఏటా ప్రభుత్వానికి సుమారు రూ. 22,900 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం మనం టెలికాం సేవలపై 18 శాతం జీఎస్టీ (GST) చెల్లిస్తున్నాం. ఈ కొత్త పన్ను గనుక అమల్లోకి వస్తే, అది సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. నెలకు 1.5 జీబీ లేదా 2 జీబీ వాడే మధ్యతరగతి జేబుకు ఇది అదనపు భారం కాక తప్పదు.

అయితే, ఈ పన్ను వసూలు విధానం ఎలా ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అందరికీ ఒకేలా పన్ను వేస్తారా? లేక ఒక నిర్ణీత లిమిట్ (ఉదాహరణకు నెలకు 50 జీబీ) దాటిన తర్వాతే ఈ ట్యాక్స్ విధిస్తారా? అనే దానిపై టెలికాం శాఖ (DoT) కసరత్తు చేస్తోంది. ఈ పన్ను అమలు వల్ల తలెత్తే ఇబ్బందులు, సాంకేతిక సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై పూర్తి స్థాయి నివేదికను సెప్టెంబర్ 2026 నాటికి సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. అప్పటి వరకు ఈ డేటా ట్యాక్స్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

CR Reddy

CR Reddy

Next Story