IPO: ఐపీఓ నిబంధనల్లో భారీ మార్పులు.. కొత్త రూల్స్ ఇవే!
IPO: కంపెనీల ఐపీఓ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. మార్కెట్ విలువ ఆధారంగా కంపెనీలు ఎంత శాతం వాటాను పబ్లిక్కు విక్రయించాలో కొత్త నిబంధనల్లో నోటిఫై చేసింది.
IPO Rules
IPO Rules: స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు మరియు కొత్తగా ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఇచ్చింది. కంపెనీల లిస్టింగ్ నిబంధనలను మరింత సరళతరం చేస్తూనే, పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సరికొత్త సవరణలను నోటిఫై చేసింది. ఈ మేరకు 'సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ రూల్స్, 2026' అమల్లోకి వచ్చాయి. ఇకపై స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా ప్రభుత్వం కొత్త వర్గీకరణ చేపట్టింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పబ్లిక్ ఇష్యూ తర్వాత కంపెనీ విలువతో సంబంధం లేకుండా కనీసం 2.5 శాతం వాటాను విక్రయించడం తప్పనిసరి.
విలువను బట్టి వాటా అమ్మకం ఇలా..
కంపెనీల పరిమాణాన్ని బట్టి షేర్ల విక్రయంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.రూ. 1,600 కోట్ల లోపు కంపెనీలు ఐపీఓ సమయంలోనే కనీసం 25 శాతం ఈక్విటీ షేర్లు లేదా డిబెంచర్లను పబ్లిక్ వాటాగా విక్రయించాలి.రూ. 1,600 - రూ. 5,000 కోట్ల కంపెనీలు.. ఈ స్థాయి కంపెనీలు ఐపీఓ తర్వాత మూడేళ్ల వ్యవధిలో 25 శాతం పబ్లిక్ వాటాను చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో రూ. 4 వేల కోట్ల లోపు ఉన్న కంపెనీలు కనీసం రూ. 400 కోట్ల షేర్లను, రూ. 4 వేల నుండి రూ. 5 వేల కోట్ల కంపెనీలు 10 శాతం షేర్లను విక్రయించాలి.రూ. 5,000 - రూ. 1 లక్ష కోట్ల కంపెనీలు.. లిస్టింగ్ తర్వాత కనీసం రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయాలి. అలాగే ఐదేళ్ల కాలంలో 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను పూర్తి చేయాలి.
భారీ కంపెనీలకు ప్రత్యేక వెసులుబాటు
పెద్ద కంపెనీల ఐపీఓలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక సడలింపులు ఇచ్చింది:రూ. 1 - 5 లక్షల కోట్ల కంపెనీలు.. ఇవి తమ ఐపీఓలో 2.75 శాతం వాటాకు సమానమైన రూ. 6,250 కోట్లను ఆఫర్ చేయాల్సి ఉంటుంది.రూ. 5 లక్షల కోట్ల పైన విలువ ఉన్న దిగ్గజాలు.. అత్యంత భారీ కంపెనీలు కనీసం రూ. 15,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచాలి.
పెట్టుబడిదారులకు కలిగే లాభమేంటి?
ఈ కొత్త సవరణల వల్ల మార్కెట్లో షేర్ల లభ్యత పెరుగుతుంది. తక్కువ వాటా విక్రయించడం వల్ల ధరల్లో వచ్చే కృత్రిమ పెరుగుదలను ఇది అరికడుతుంది. అలాగే, చిన్న కంపెనీల నుండి భారీ కార్పొరేట్ సంస్థల వరకు పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలు పక్కాగా అమలు కావడం వల్ల మార్కెట్లో పారదర్శకత పెరుగుతుంది. సాధారణ పెట్టుబడిదారులకు నాణ్యమైన కంపెనీల్లో భాగస్వామ్యం పొందే అవకాశం మరింత మెరుగుపడుతుంది. మొత్తానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం భారత స్టాక్ మార్కెట్‌ను మరింత బలోపేతం చేయడమే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనుంది.




