New Rs 1000 Note: కొత్త రూ.1000 నోటు మళ్లీ వస్తోందా? కేంద్రం ఏమందంటే?

New Rs 1000 Note: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త రూ. 1000 నోటు ప్రచారంపై కేంద్రం స్పందించింది. అదంతా ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్‌చెట్ తేల్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Oct 2026 3:00 AM IST
New Rs 1000 Note
X

New Rs 1000 Note: కొత్త రూ.1000 నోటు మళ్లీ వస్తోందా? కేంద్రం ఏమందంటే?

New Rs 1000 Note: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) త్వరలోనే కొత్తగా రూ. 1,000 నోటును చలామణిలోకి తీసుకురానుందంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పసుపు రంగులో ఉండి, ఆలయం ఫొటో ఉన్న ఆ నోటు త్వరలోనే మార్కెట్లోకి రానుందంటూ రకరకాల వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

అవన్నీ కేవలం వదంతులే – పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న రూ. 1,000 నోటు ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్బీఐ ఎలాంటి వెయ్యి రూపాయల నోటునూ కొత్తగా జారీ చేయలేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ (PIB Fact Check) విభాగం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అధికారికంగా పోస్ట్ పెట్టి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించింది.



ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లు ఇవే:

దేశంలో నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా 2016 నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్ల రద్దును చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కొత్త రూ. 500 నోట్లతో పాటు రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టింది. అయితే కాలక్రమేణా రూ. 2,000 నోట్లను కూడా ఉపసంహరించుకుంది. ప్రస్తుతం భారత్‌లో అధికారికంగా రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200 మరియు రూ. 500 డినామినేషన్ల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి. అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్