New Rules From July 1 : నేటి నుంచే సరికొత్త రూల్స్.. సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!

New Rules From July 1 : జూలై 1 నుంచి మారిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు. పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు, ఆధార్‌ కార్డులో ఈమెయిల్ ఉచిత అప్‌డేట్, రైల్వే కొత్త జరిమానాల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 1 July 2026 7:11 AM IST
New Rules From July 1
X

New Rules From July 1

New Rules From July 1 : కొత్త నెల జూలై వచ్చేసింది. సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రావడం సర్వసాధారణం. అదేవిధంగా జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు కీలక రంగాలలో మార్పులు తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, రైల్వే ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అదనపు ఖర్చులు, ఊహించని జరిమానాలు, ఇతర ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే ప్రతీఒక్కరూ ఈ రోజు నుంచి మారిన నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులపై అదనపు భారం

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. జూలై 1వ తేదీ నుంచి పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచింది. ఈ పెరిగిన కొత్త ధరలు కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకునే వారికే కాకుండా, పాత పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాలనుకునే వారికి కూడా వర్తిస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం సాధారణ కేటగిరీలో 36 పేజీల పాస్‌పోర్ట్ కోసం ఇకపై రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలనుకునే వారి కోసం అందించే తత్కాల్ సేవలకు రుసుమును ఏకంగా రూ.5,000కు పెంచారు.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పెరిగిన జరిమానాలు

రైళ్లలో ప్రయాణించే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. రైల్వే శాఖ నిబంధనలను ఉల్లంఘించే వారికి విధించే జరిమానాలను జూలై 1 నుంచి భారీగా పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తూ దొరికిపోతే కనీస జరిమానాగా రూ.250 వసూలు చేసేవారు. కానీ నేటి నుంచి ఈ కనీస జరిమానా మొత్తాన్ని డబుల్ చేస్తూ రూ.500కి పెంచారు. వీటితో పాటు వేరొకరి టికెట్‌పై ప్రయాణించడం, జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ ఉన్న బోగీల్లోకి ఎక్కడం, రైళ్లలో నిషేధిత వస్తువులను రవాణా చేయడం, మద్యపానం సేవించి ప్రయాణించడం లాంటి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే ఏకంగా రూ.5,000 వరకు జరిమానా విధిస్తారు.

ఆధార్ కార్డుదారులకు యూఐడీఏఐ అదిరిపోయే గుడ్ న్యూస్

ఆధార్ కార్డు ఉన్న కోట్లాది మంది వినియోగదారులకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక సూపర్ అప్‌డేట్ ఇచ్చింది. ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవడానికి లేదా కొత్తగా అప్‌డేట్ చేసుకోవడానికి ఇప్పటివరకు వసూలు చేస్తున్న ఫీజును జూలై 1 నుంచి పూర్తిగా రద్దు చేసింది. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని మార్చుకుంటే ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈ సేవ కోసం ఉన్న రూ. 75 రుసుమును పూర్తిగా మాఫీ చేశారు. ఈ ఉచిత సదుపాయం వచ్చే ఆరు నెలల పాటు, అంటే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

డీజిల్ విక్రయాలపై ఆంక్షల తొలగింపు

వాణిజ్య, వ్యాపార రంగంలో ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో డీజిల్ విక్రయాలపై ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను జూలై 1 నుంచి పూర్తిగా ఎత్తివేసింది. గతంలో వాణిజ్య వినియోగదారులకు రిటైల్ అవుట్‌లెట్ల వద్ద డీజిల్ కొనుగోలు చేయడానికి కొన్ని పరిమితులు ఉండేవి. అయితే కేంద్రం సవరించిన సరికొత్త నిబంధనల ప్రకారం నేటి నుంచి ఎలాంటి లిమిట్స్ ఉండవు. వాణిజ్య వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా పెట్రోల్ పంపుల వద్ద ఎంత పరిమాణంలోనైనా డీజిల్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story